ఎంతమంది పిల్లలున్నా.. తల్లికి మాత్రం ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భేదభావం వుండదు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన తల్లికి తన కన్నా అన్నయ్య అంటేనే ప్రేమ ఎక్కువనే కోపంతో కన్నతల్లిని చంపేశాడు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం రైవా జిల్లా ఖాతిక గ్రామంలోని సావిత్రి పాండే (44), కృపా శంకర్ పాండే భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే వీరి పెద్ద కుమారుడు గతేడాది చనిపోయాడు.

అతనిపై ప్రేమతో తల్లి పెద్ద కొడుకుని తలుచుకుని ఏడుస్తూ ఉండేది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటూ తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకుంటే కనరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లడిల్లిపోయింది.

అయితే అమ్మ తన కంటే చనిపోయిన అన్నయ్యను ఎక్కువగా ప్రేమిస్తోందని చిన్న కొడుకు ధీరేంద్ర కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య, తల్లిదండ్రులతో చిన్న విషయాలకే గొడవ పడేవాడు.

అన్నయ్యను తలచుకున్నప్పుడల్లా చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఓ రోజు ఆగ్రహంతో తల్లి సావిత్రిని పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని అడవిలో పడేశాడు.

అంతేకాకుండా ఈ తతంగాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. తండ్రి కృపా శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధీరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తల్లిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

సావిత్రిని హత్య చేసే సమయంలో తీసిన వీడియోలో.. ఆమె తనను చంపొద్దని వేడుకుంటున్నా.. ధీరేంద్ర ఏమాత్రం కనికరం లేకుండా తల్లిని గొంతు కోసం హతమార్చాడని పోలీసులు తెలిపారు.