భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను అత్యంత దారుణంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం నేలమంగళ తాలుకా చిక్కనాయకనపాళ్య గ్రామానికి చెందిన మంజుల, రేవణ్ణ దంపతుల కుమార్తె పూర్తిమను 2018 నవంబర్‌లో మాగది తాలుకా హాలశెట్టిహళ్లికి చెందిన గంగాధరయ్య కుమారుడు నాగరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు.

పూర్ణిమ బెంగళూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేది. నాగరాజు గ్రామంలోనే వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో పూర్ణిమపై నాగరాజుకు అనుమానం మొదలైంది. దీంతో ప్రతిరోజూ ఆమెతో గొడవపడేవాడు.

బుధవారం సాయంత్రం దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో నాగరాజు ఆవేశం పట్టలేక పక్కనేవున్న కొడవలితో భార్యను నరికి చంపి, అక్కడి నుంచి పారిపోయాడు.

పని మీద బయటకు వెళ్లిన నాగరాజు తండ్రి గంగాధరయ్య రాత్రి ఇంటికి వచ్చి చూడగా కోడలు రక్తపు మడుగులో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పూర్ణిమ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నాగరాజు కోసం గాలిస్తున్నారు.