Asianet News TeluguAsianet News Telugu

భార్యపై అనుమానం: తమిళనాడులో ఎనిమిదేళ్ల కూతురిని చంపిన తండ్రి

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురిని హత్య చేశాడు. ఈ విషయమై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కాళీముత్తు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Man kills his eight year old daughter in Tamilnadu
Author
First Published Sep 26, 2022, 2:29 PM IST

చెన్నై: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురును అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడు రాష్ట్రంలోని  మధురై లోని జైహింద్ పురంలో  కాళిముత్తు అనే వ్యక్తి తన భార్య ప్రియదర్శిని , ఎనిమిదేళ్ల కూతురు  తనిష్కతో కలిసి నివాసం ఉంటున్నారు. కాళీముత్తు టైలర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య ప్రియదర్శిని  ఓ సంస్థలో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తుంది. తన భార్యపై కాళీముత్తుకు అనుమానం పెంచుకున్నాడు.. తనిష్క కూడా తమకు పుట్టిన బిడ్డ కాదనే అనుమానం కూడా ఆయనకు వచ్చింది.తన కూతురికి తన పోలీకలు లేవని కూడా ఆయన భార్యతో గొడవ పడే సమయంలో అంటుంటేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై భార్యతో కాళీముత్తు తరచుగా గొడవకు దిగేవాడు.  

ఈ నెల 3వ తేదీన కాళీముత్తు తన సోదరి ఇంటికి  కూతురు తనిష్కతో కలిసి  వెళ్లాడు. వారం రోజుల తర్వాత అతను ఇంటికి ఒంటరిగానే వచ్చాడు. కూతురి గురించి భార్య ప్రియదర్శిని అడిగితే వారం రోజులపాటు తన సోదరి ఇంటి వద్దే తనిష్క ఉంటుందని చెప్పాడు. మూడు రోజుల క్రితం ప్రియదర్శిని తన భర్తతో కలిసి సోదరుడి ఇంటికి వెళ్లింది. అక్కడి నుండి కాళీముత్తు తన సోదరి ఇంటికి వెళ్లి తనిష్కను తీసుకు వస్తానని చెప్పాడు. ప్రియదర్శిని నేరుగా ఇంటికి చేరుకుంది. 

తమ ఇంటి నుండి దుర్వాసన వస్తుందని చుట్టుపక్కలవాళ్లు ప్రియదర్శినికి చెప్పారు. తమ ఇంట్లోని స్టోర్ రూమ్ లోని బకెట్ లో ప్లాస్టిక్ కవర్ లో  కుళ్లిన స్థితిలో ఉన్న తన కూతురి మృతదేహం చూసి ప్రియదర్శిని కన్నీరు మున్నీరుగా విలపించింది.  వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పది రోజుల క్రితమే తనిష్క మృతి చెందిందని పోలీసులు చెప్పారు. అయితే తన సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన కాళీముత్తు ప్రియదర్శినికి అందుబాటులోకి రాలేదు. ప్రియదర్శిని పిర్యాదు మేరకు పోలీసులు కాళీముత్తు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios