కూతురిలాంటి కోడలిపై ఓ మామ కన్నేశాడు. ఆమెపై మోజు పెంచుకొని ఎలాగైనా అనుభవించాలనుకున్నాడు. తన కోరిక తీర్చమని ఆమెపై బలవంతం చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో హతమార్చాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... హాసన్‌ జిల్లాకు చెందిన వీణ (26)కు రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కాగా రెండేళ్ల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ మృతి చెందింది. అప్పటినుంచి నాగరాజు ప్రతిరోజూ కోడలు వీణను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో విషయాన్ని భర్త అనిల్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అనిల్‌ సైతం తండ్రి నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు.

అయినప్పటికీ తీరు మార్చుకోని నాగరాజు వీణను లైంగికంగా వేధించసాగాడు. దీంతో భార్య, పిల్లలతో కలసి అనిల్‌ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. దీంతో వీణపై అక్కసు పెంచుకున్న నాగరాజు కొడుకు అనిల్‌ ఇంటికి, దుకాణానికి వస్తూ వీణను మాటలతో చేష్టలతో వేధించసాగాడు  . దీనిపై అనిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లిన నాగరాజు జామీనుపై విడుదలై కోడలిని మరింత వేధించసాగాడు. 

ఈ క్రమం లో ఆదివారం ఇంటి బయటకు వచ్చిన వీణపై తమ్ముడు మంజు సహకారంతో కత్తితో దాడి చేసిన నాగరాజు గొంతు, కడుపులో పొడిచాడు. వీణ కేకలు విన్న అనిల్, గ్రామస్థులు వెంటనే అక్కడికి వెళ్లగా అప్పటికే వీణ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నాగరాజు, మంజు వెంటనే బైకుపై తప్పించుకున్నారు. వీణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మండ్య పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.