ముంబై: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపి ఆమె శవాన్ని గోడ లోపల దాచిపెట్టాడు. మహారాష్ట్రలోని పల్ ఘర్ జిల్లాలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఉమ్రోలికి చెందిన అమితా మోహిత్ అనే యువతి నాలుగు నెలల క్రితం ప్రియుడు హనీఫ్ పాటెల్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఇరువురు కూడా పల్ ఘర్ జిల్లాలోని వన్ గావ్ ఏరియా వృందావన్ అపార్టమెంటులోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటూ వచ్చారు. 

అయితే, ప్రేయసీప్రియుల మధ్య ఇటీవల గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో హనీఫ్ తన ప్రియురాలిని చంపేశాడు. ఆమె శవాన్ని దాచి పెట్టడానికి ఓ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫ్లాట్ లోనే ఓ గోడ నిర్మించి అందులో శవాన్ని పెట్టాడు. 

అమితా మోహిత్ కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తూ వచ్చాడు. వాట్సప్, ఇతర సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ ఆమె పేరు మీద టచ్ లో ఉంటూ వచ్చాడు. అయితే అమితా మోహిత్ కుటుంబ సభ్యులకు అనుమానం రానే వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆదారంగా అతన్ని పట్టుకున్నారు. 

గోడ లోపల దాచిన అమితా మోహిత్ శవాన్ని పోలీసులు గురువారంనాడు వెలికి తీశారు. శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. విచారణలో హనీఫ్ తన నేరాన్ని అంగీకరించాడు.