కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్ డౌన్ లో మద్యం దొరకక మందు బాబులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరైతే బలవన్మరణాలు కూడా పాల్పడ్డారు. 

మరికొందరు పిచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఆస్పత్రులచుట్టూ తిరుగుతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బీరు అనుకొని ఏకంగా యాసిడ్ తాగేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టీ టీ నగర్ పోలీసలు తెలిపిన సమాచారం ప్రకారం సురేశ్ సజాల్కర్(50) అనే వ్యక్తి సోమవారం ఓ సీసాలో ఉన్న యాసిడ్‌ని బీర్ అని భావించి.. దాన్ని తాగాడు. దీంతో అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని బతికించే ప్రయత్నం చేశారు. 

రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతను బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. చాలా రోజులుగా మద్యం దొరకకపోవడంతో.. నిరాశకి గురైన  బీర్‌ బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ తాగాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాగా..  దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ సందీప్ చౌక్సీ తెలిపారు.