కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. దొంగతనం చేశారనే అనుమానంతో ఓ గుంపు భార్యాభర్తలపై దాడి చేసింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడగా, అతని 41 ఏళ్ల వయస్సు గల భార్య మరణించింది. పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో ఈ దారుణమైన సంఘటన శుక్రవారం జరిగింది. 

ఆ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. సంఘటనపై మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమపై 14 మంది దాడి చేశారని, కర్రలతోనూ రాళ్లతోనూ తమను కొట్టారని, వారిలో ఒకరి ఇంట్లో తాము దొంగతనం చేశామని ఆరోపించి తమపై దాడి చేశారని మృతురాలి భర్త అలీ హొస్సేన్ మొల్ల ఫిర్యాదులో వివరించాడు. 

తమ పొరుగున ఉండేవారు తమపై దాడి చేశారని, స్పృహ తప్పి పడిపోయేవరకు తన భార్య సూఫియా బీబీని చితకబాదారని అతను ఆరోపించాడు. దాడిలో గాయపడిన ఇరువురిని స్థానికులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మహిళను కోల్ కతాలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఇతర నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.