Asianet News TeluguAsianet News Telugu

5 స్టార్ హోటల్‌కు రూ. 23 లక్షల కుచ్చుటోపీ.. మూడున్నర నెలలు విలాసంగా గడిపి.. విలువైన వస్తువులతో పరార్

ఢిల్లీలోని లగ్జరీ హోటల్ ది లీలా ప్యాలెస్‌లో ఓ వ్యక్తి సుమారు మూడున్నర నెలలు గడిపి రూ. 23 లక్షల డబ్బులు సెటిల్ చేయకుండా పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి మోసం చేశాడు. యుఏఈ రాజకుటుంబ ప్రభుత్వంలో కీలక పదవిలో పని చేస్తున్నానని సిబ్బందిని నమ్మించి టోకరా కొట్టాడు. ఫేక్ బిజినెస్ కార్డుతో హోటల్‌లో ఉన్నాడు. హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుడిని కర్ణాటకలో అరెస్టు చేశారు. 
 

man held who left 5 star hotel without paying rs 23 lakh bills
Author
First Published Jan 22, 2023, 3:08 PM IST

న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు కుచ్చుటోపీ పెట్టాడు. సుమారు నాలుగు నెలలు అందులో విలాసంగా గడిపి చివరకు రూ. 23 లక్షల టోకరా కొట్టాడు. హోటల్ బిల్లు ఎగ్గొట్టడమే కాదు.. హోటల్ గదిలోని విలువైన వస్తువులనూ దొంగిలించాడు. ఆ వ్యక్తి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడం, ఖాతాలో డబ్బు లేకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు.

దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన మహమ్మద్ షరీఫ్‌ (41)గా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ నిందితుడిని జనవరి 19వ తేదీన అరెస్టు చేశారు. ఈ మోసం ఎలా జరిగిందంటే..

మొహమ్మద్ షరీఫ్ తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తిని అని హెటల్ సిబ్బందిని నమ్మించాడు. వారికి ఫేక్ బిజినెస్ కార్డు చూపించారు. యుఏఐ రాజకుటుంబానికి చెందిన ఒకరి వద్ద తాను ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటూ మూడున్నర నెలలు షరీఫ్ ఫైవ్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్ హోటల్‌లో గడిపాడు. చివరకు ఆ హోటల్‌లోని విలువైన వస్తువులను, ఇతర బిల్లులను మొత్తంగా రూ. 23,46,412 చెల్లించకుండానే చెక్కేశాడు. మొత్తం బిల్లు రూ. 35 లక్షలలో రూ. 11.5 లక్షలు ఆ లగ్జరీ హోటల్‌కు చెల్లించాడు.

గతేడాది ఆగస్టు 1వ తేదీన షరీఫ్ ఆ హోటల్‌కు వచ్చాడు. నవంబర్ 20వ తేదీ వరకు అక్కడే ఉన్నాడు. ఒక ఫేక్ బిజినెస్ కార్డుతో అక్కడ ఉన్న షరీఫ్ తనను తాను యుఏఈ రాజకుటుంబంలోని షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహయాన్‌ ఆఫీసులో పని చేస్తున్నట్టు నమ్మించాడు. యుఏఈ రెసిడెన్సీ కార్డు కూడా చూపించాడు.

అయితే, హోటల్‌ నుంచి వెళ్లిపోయేటప్పుడు రూ. 20 లక్షల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్‌ను వారి చేతిలో పెట్టాడు. వెళ్లిపోయాడు. కానీ, ఈ చెక్ డ్రా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ ఖాతాలో డబ్బులు లేక చెక్ బౌన్స్ అయింది. దీంతో ఇది కచ్చితంగా కుట్రపూరితంగా జరిగిన మోసమే ని స్పష్టమైనట్టు పోలీసులు తెలిపారు.

జనవరి 14వ తేదీన ఈ మోసానికి సంబంధించి సరోజిని నగర్ పోలీసు స్టేషన్‌లో హోటల్ జెనరల్ మేనేజర్ అనుపమ్ దాస్ గుప్తా ఫిర్యాదు చేశాడు. మొహమ్మద్ షరీఫ్ ది లీలా ప్యాలెస్‌లో గతేడాది ఆగస్టు 1వ తేదీ నుంచి గతేడాది నవంబర్ 20వ తేదీ వరకు ఉన్నాడని, మొత్తం బిల్లు చెల్లించకుండానే హోటల్‌కు చెందిన విలువైన వస్తువులను వెంటబెట్టుకుని వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు అందగానే ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని, నిందితుడిని అరెస్టు చేశామని వివరించారు. తదుపరి దర్యాప్తు జరుగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios