న్యూడిల్లీ: అతడిది సెల్ ఫోన్స్ చోరీ చేయడంలో అందెవేసిన చేయి. ఇలా బస్సుల్లో ప్రయాణించేవారి వద్ద కొన్ని వందల సెల్ ఫోన్లను అత్యంత చాకచక్యంగా దొంగిలించి ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదు. అయితే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది అన్నట్లు వందల దొంగతనాలు చేసినా పట్టుబడని ఈ దొంగ సొంత భార్య మొబైల్ చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. 

డిల్లీ నివాసి వినోద్ తన భార్యతో గొడవపడి వేరుగా వుంటున్నాడు. అయితే తనను దూరం పెట్టిన భార్యను ఎలాగయినా వేధించాలని భావించిన అతడు ఆమె సెల్ ఫోన్ ను దొంగిలించాడు. ఇంట్లో  ఒంటరిగా వున్న ఆమెను కత్తితో బెదిరించి చేతిలోని మొబైల్ లాక్కుని వెళ్లిపోయాడు. 

read more  రూ.కోటి విలువచేసే బంగారం చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్

దీంతో సదరు మహిళ అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడి కోసం గాలించి చివరకు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం గురించి వినోద్ ను పోలీసులు విచారించగా తాను చేసిన వేరే నేరాలను కూడా అంగీకరించాడు. 

తాను తరచూ బస్సుల్లో ప్రయాణికుల వద్ద ఫోన్లు దొంగిలిస్తుంటానని, ఇందు కోసం తనకు మరో ముగ్గురు స్నేహితులు కూడా సహాయం చేస్తుంటారని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.