మధ్యప్రదేశ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది మైనర్ బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడ్డమే కాకుండా బలవంతంగా ఆమెను వివాహం చేసుకున్న కేసులో 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్లోని నిషాంత్ పురాకు చెందిన 14 ఏళ్ల బాలికపై నిందితుడు గతేడాది మేలో మొదటిసారిగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు బాలిక కుటుంబానికి బాగా తెలిసినవాడు కావడంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు.

ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో నిందితుడు అతని తల్లి బాధిత బాలిక కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి, ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నారు. 

వివాహం అనంతరం బాలికను ఇంట్లోని ఓ గదిలో బంధించి, తరచూ అత్యాచారం చేస్తూ భౌతికంగా హింసించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బాలికను తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వారు నిరాకరించే వారు. 

ఒకవేళ ఆమె కలిసేందుకు ప్రయత్నించినా నిందితుడి తల్లి విచక్షణారహితంగా దాడి చేసేదని బాలిక పోలీసులతో తెలిపింది. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం, అత్యాచారం కింద పలు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

 అతని తల్లి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు తన దగ్గర వివాహ ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని పోలీసులతో తెలిపాడు. బాధితురాలు మైనర్ కావడంతో ఈ వివాహ పత్రాలు ఎలా వచ్చాయి, నిందితుడికి ఎవరు సహకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.