ప్రియురాలిని కలవడానికి వెళ్లి గ్రామస్తుల కంటపడి.. చివరికి పెళ్లి చేసుకుని బయటపడ్డాడో ప్రేమికుడు. ఆమెను కలవడం కోసం 12 కి.మీ. లు నడిచి వెళ్లాడు. 

బీహార్ : ప్రేమ కోసం బలవంతంగా పెళ్లి అనే వలలో పడ్డాడు యువకుడు. ప్రేయసిని కలుసుకోవడానికి రహస్యంగా వెళ్లి, గ్రామస్తుల కంటపడి.. దేహశుద్ధి చేయించుకోవడమే కాకుండా.. ఆమెతో వివాహం కూడా జరిపించి పంపేశారు. ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. ఓ యువకుడు తన పక్క గ్రామంలోని ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఎవరికీ తెలియకుండా వారిద్దరూ.. అర్ధరాత్రి పూట రహస్యంగా కలుసుకునేవారు. అలాగే ఆరోజు కూడా ప్రేయసిని కలిసేందుకు ఎంతో కష్టపడి 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు అతను.

అయితే ఆ రాత్రి.. అంతకుముందు రాత్రుళ్ళా గడవలేదు. అతని జీవితంలో భయంకరమైన కాలరాత్రిగా మిగిలిపోయింది. అతను గ్రామస్తుల కంటపడ్డాడు. చావుదెబ్బలు తిన్నాడు. చివరికి.. ప్రేయసిని కలుద్దామని వెళ్లి.. పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ ఘటన బీహార్ లోని బంకలో జరిగింది. అది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బంక జిల్లాలోని శంభుగంజుకు చెందిన సుభాష్ దాస్ అనే యువకుడు, శంభుగంజ్ పక్క గ్రామానికి చెందిన సునైనా అనే యువతిని ప్రేమించాడు.

ఆటో బోల్తా.. బాలుడి మృతదేహాన్ని అండర్ పాస్ లో వదిలేసి వెళ్లిన స్నేహితులు, ముగ్గురు అరెస్ట్..

వీరిద్దరూ.. వీలు కుదిరినప్పుడల్లా కలుసుకునేవారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా సుభాష్ దాస్ ప్రియురాలిని కలుసుకోవడానికి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆమె గ్రామానికి చేరుకున్నాడు. కాలువ ఒడ్డున ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో గ్రామస్తులు వీరిని గమనించారు. వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యువకుడిని చితకబాదారు. అది చూసి తట్టుకోలేని ప్రియురాలు వారికి అడ్డుపడింది. అతడి తప్పేం లేదని తను కూడా అతని ప్రేమిస్తున్నానని తనని రమ్మని చెప్పానని తెలిపింది. 

అదివిన్న గ్రామస్తులు వెంటనే అర్థరాత్రే.. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. గ్రామానికి రమ్మని పిలిపించారు. అమ్మాయి తల్లిదండ్రుల్ని కూడా రమ్మన్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి.. గ్రామ శివాలయంలో పంచాయతీ పెట్టారు. ఇంతవరకు వచ్చింది కాబట్టి వారిద్దరికీ పెళ్లి చేయాలని అన్నారు. దీనికి చేసేదేం లేక ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో సుభాష్ దాస్ సునైనా మెడలో తాళికట్టి, భార్యగా చేసుకున్నాడు. కథ సుఖాంతం అవ్వడంతో పోలీసుల దాకా వెళ్లకుండానే శుభం కార్డు పడింది.