భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపేసి శవాన్ని బెడ్ బాక్సులో దాచి పెట్టాడు. దానిపైనే రెండు రోజుల పాటు నిద్రపోయాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 186 కిలోమీటర్ల దూరంలో గల సాగర్ లో ఈ ఘటన జరిగింది. 

మృతురాలిని సాగర్ సిటీలోని మోతీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ వార్డుకు చెందిన 32 ఏళ్ల ఆర్తి అహిర్వార్ గా పోలీసులు గుర్తించారు. సోమవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్తి భర్త షేర్ సింగ్ అహిర్వార్ ను అరెస్టు చేశారు. 

షేర్ సింగ్ గొడ్డలి కొనుక్కుని రావడం, మద్యం మత్తులో హత్య గురించి నోరు జారడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సోమావరం ఉదయం పోలీసులు ఇంటికి చేరుకున్నారు. వారికి గుప్పుమని దుర్వాసన కొట్టింది. దాంతో పోలీసులు ఇంట్లో సోదాలు చేశారు. 

వారికి అతడు నిద్రపోయే బెడ్ బాక్స్ లో ఆర్తి శవం పోలీసులకు కనిపించింది. మద్యానికి బానసైన భర్తతో గొడవలతో ఆర్తి తన పదేళ్ల కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లందని, కుమారుడిని తల్లిగారింట్లో వదిలిపెట్టి శుక్రవారం వచ్చిందని చెబుతున్నారు. 

భర్త సోమవారం ఆమెను హత్య చేసి శవాన్ని మంచం బాక్సులో దాచి, దానిపైనే రెండు రోజుల పాటు నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు .కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.