తమిళనాడులోని మదురై, దిండిగల్ హైవేపై ప్రమాదం జరిగింది. ఓ బైక్ ట్రక్‌ను ఓవర్ టేక్ చేయబోయి దాని కిందకు వెళ్లింది. ఆ బైక్‌ను ట్రక్ కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లింది. బైక్ డ్రైవర్ మరణించాడు. కాగా, బైక్ పై ఉన్న ఆ వ్యక్తి భార్య, కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం బైక్ పై ప్రయాణం చేస్తున్నది. భార్య, కొడుకు వెనుక ఉండగా.. భర్త బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ముందు వెళ్లుతున్న భారీ ట్రక్‌ను ఓవర్ టేక్ చేయబోయాడు. ఇంతలో ప్రమాదం జరిగింది. ఆ ట్రక్ టైర్ కిందకు బైక్ వెళ్లింది. ఆ వ్యక్తిని ట్రక్ సుమారు కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త స్పాట్‌లోనే మరణించాడు. భార్య, కొడుకు స్వల్ప గాయాలతో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ బైక్ వెనుక వెళ్లుతున్న వారు కారులో నుంచి వీడియో తీశారు. మదురై, దిండిగల్ హైవే పై ఈ ఘటన జరిగింది. తమిళరసన్.. భార్య, పిల్లాడిని బైక్ పై కూర్చోబెట్టుకుని వెళ్లుతున్నాడు. ముందున్న ట్రక్‌ను అతను ఓవర్ టేక్ చేయాలని అనుకున్నాడు. ఆ ట్రక్ పక్కగా వెళ్లాడు. అయితే, కుడి వైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచే ఆ ట్రక్‌ను ఓవర్ టేక్ చేయాలని అనుకున్నాడు. ఆ ట్రక్‌ను దాటేస్తుండగా ఓ కూడలి వచ్చింది. అక్కడ బారికేడ్లు కూడా ఉన్నాయి. ఆ రెండు బారికేడ్ల మధ్య నుంచి వెళ్లాల్సి ఉన్నది. సరిగ్గా ఆ బారికేడ్ గుండా ట్రక్ వెళ్లుతుండగా దానితో సమాంతరంగా బైక్‌ను కూడా పోనిచ్చాడు. కానీ, ఆ బైక్ ముందు ఆ బారికేడ్‌ను తాకినట్టుగా ఆ వీడియోలో కనిపించింది. అనంతరం బైక్ ట్రక్ కిందకు వెళ్లింది.
బైక్ అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న భార్య, కొడుకులు కింద పడిపోయారు. భార్య వెంటనే పైకి లేచి కొడుకు వద్దకు పరుగులు పెట్టింది. కొడుకును చేరదీసుకుంది. మరో వైపు ఆ ట్రక్ టైర్ల కింద బైక్ అలాగే ఈడ్చుకుంటూ వెళ్లింది. అందులోనే ఆమె భర్త తమిళసరన్ కూడా చిక్కుకుని ఉన్నాడు. అతను మరణించాడు. సుమారు ఒక కిలోమీటరు మేరకు ఆ వ్యక్తిని ట్రక్ అలాగే ఈడ్చుకుంటూ వెళ్లింది.
హైవేపై ఆ రక్తపు మరకల వెంట వెళ్లగా పోలీసులకు తమిళసరన్ డెడ్ బాడీ లభించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ట్రక్ డ్రైవర్ కోసం గాలింపులు జరుపుతున్నారు.
