బ్రజేష్ తన సహోద్యోగులతో కలిసి ఓ రెస్ట్రో బార్‌కు వెళ్లారు. పార్టీ చేసుకున్నారు. పార్టీ అయిపోయిన తర్వాత బార్ స్టాఫ్ దగ్గరకు వెళ్లి బిల్ పేమెంట్ చేయాలనుకున్నారు. కానీ, ఈ బిల్ పేమెంట్ దగ్గరే చిన్న వాగ్వాదం మొదలై తగువుగా మారింది. ఆ తర్వాత తీవ్ర ఘర్షణగా పరిణమించడంతో బ్రజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం హాస్పిటల్‌లో ఆయన మరణించాడు.
న్యూఢిల్లీ: కొలీగ్స్ అందరూ కలిసి రెస్ట్రో బార్‌కు పోయారు. దావత్ చేసుకున్నారు. తీరా పార్టీ అయిపోయాక బిల్ పేమెంట్ దగ్గర తీవ్ర ఘర్షణ జరిగింది. రెస్ట్రో బార్ సిబ్బందికి, ఆ గ్రూప్‌నకు మధ్య గొడవ జరిగింది. స్టాఫ్‌తో గొడవ పడుతూ ఒకరు దుర్మరణం చెందారు. గాయాలపాలైన తర్వాత ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు స్పాట్‌కు వచ్చారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. రెస్ట్రో బార్ సిబ్బంది సుమారు డజను మందిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
బిహార్‌కు చెందిన 30 ఏళ్ల బ్రజేష్ అనే వ్యక్తి నోయిడాలో ఓ కార్యాలయంలో ఉద్యోగి. ఆయన మరికొందరు తన సహోద్యోగులతో కలిసి నోయిడాలోని సెక్టార్ 39 పోలీసు స్టేషన్ పరిధిలోని గార్డెన్ గలేరియా మాల్ లాస్ట్ లెమన్స్ రెస్ట్రో బార్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ అయిపోయాక రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో బ్రజేష్ గ్యాంగ్‌తో ఆ రెస్ట్రో బార్ స్టాఫ్‌కు గొడవ జరిగింది. బిల్ పేమెంట్‌కు సంబంధించి ఈ ఘర్షణ చోటుచేసుకుంది.
సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిందని అదనపు డీసీపీ రణవిజయ్ సింగ్ వివరించారు. తొలుత బిల్ పేమెంట్ గురించి బ్రజేష్, ఆయన తోటి ఉద్యోగులు ఆరా తీశారు. ఆ తర్వాత రెస్ట్రో బార్ సిబ్బందితో తగువు మొదలైంది. అది స్వల్ప కాలంలో ఘర్షణగా మారింది. ఈ ఘర్షణలో బ్రజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఈ ఘర్షణలో ఉన్న ఎనిమిది మందిని గుర్తించినట్టు వివరించారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుమారు ఒక డజను మంది రెస్ట్రో బార్ సిబ్బందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు అదనపు డీసీపీ వివరించారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెలలోనే బిజినెస్ వ్యవహారాల్లో తలెత్తిన వివాదం ఇద్దరు భాగస్వాముల ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. రూ.15కోట్లు మోసం చేయడమే కాదు చివరకు ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడలేదు. ఇలా బీర్ బాటిల్స్ తో దాడిచేసి ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నరేంద్రపై హత్యాయత్నానికి పాల్పడిన దారుణం ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... విజయవాడ పట్టణంలో ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ ను నరేంద్ర, మనోహర్, వెంకటేశ్వర రావు కలిసి ఏర్పాటుచేసారు. అయితే కొంతకాలం అంతా సాఫీగానే సాగగా ఇటీవల భాగస్వాముల మధ్య తేడాలు వచ్చాయి. హోటల్ నిర్వహణలో తనకు మనోహర్ రూ.15కోట్లు మోసం చేసాడని నరేంద్ర ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వైరం పెరిగి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంది.
