అతను ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతనిని ప్రేమించింది. తనని పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే.. ఆ పెళ్లికి సదరు యువతితోపాటు.. ఆమె తల్లి అంగీకరించకపోవడం గమనార్హం. దీంతో.. పెళ్లి చేయడం లేదనే కోపంతో.. ప్రియురాలిని, ఆమె తల్లిని చంపేసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై కొరుక్కుపేట అనంతనాయగినగర్‌కు చెందిన వెంకటమ్మ (50), వెంకటేశన్‌ దంపతులకు కుమార్తె రజిత (24) ఉంది. వెంకటేశన్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో రజితకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉద్యోగం లభించింది. అదే ప్రాంతానికి చెందిన భూపాలన్‌ కుమారుడు సతీష్‌ (32) కార్పొరేషన్‌లో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమను వెంకటమ్మ వ్యతిరేకించింది. అంతేగాక అదే ప్రాంతానికి చెందిన ఒక యువకునితో రజితకు పెళ్లి చేసేందుకు గత వారం నిశ్చితార్థం జరిపించింది. దీంతో సతీష్‌ గురువారం రాత్రి వెంకటమ్మతో గొడవకు దిగాడు. అనంతరం వెంకటమ్మ, రజిత ఒంటిపై పెట్రోల్‌ పోసి తాను నిప్పంటించుకున్నాడు. ముగ్గురూ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఆర్‌కేనగర్‌ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడి హత్య కేసులో ఇద్దరి అరెస్టు: చెన్నై నొలంబూరు వావిన్‌ సమీపంలో గురువారం యువకుడిని హత్య చేసిన కేసులో శుక్రవారం విష్ణు (33), భాస్కర్‌ (44)ను పోలీసులు అరెస్టు చేశారు.