హత్య కేసులో ఓ వ్యక్తిని సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఇతర నిందితులతో పాటు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే అతడు 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.

హత్య కేసులో ఓ వ్యక్తిని సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఇతర నిందితులతో పాటు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే దీనిని అతనితో పాటు, మిగిలిన దోషులు చేసిన అప్పీల్‌ను 2006లో అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. అయితే ఆ అప్పీల్‌ను సుప్రీం కోర్టు 2009లో కొట్టివేసింది. దీంతో అతనికి జీవిత ఖైదును సవాలు చేసే అన్ని చట్టపరమైన అవకాశాలు పూర్తి అయ్యాయి. అయితే 12 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే హత్య జరిగిన తాను మైనర్‌ అని.. జువెనైల్ జస్టిస్‌ కోసం ఆ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

అతడు తాను జైలు నుంచి విడుదల కోసం లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. అతని పత్రాలను పరిశీలించిన లాయర్లు.. నేరం జరిగినప్పుడు అతడి 18 ఏళ్లలోపేనని గుర్తించారు. నేరం జరిగింది 2004 జనవరి 8వ తేదీన అని.. దోషిగా నిర్దారించబడిన వ్యక్తి పుట్టిన తేదీ 1989 మే 6 అని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో దీనిపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు.. ఉత్తరప్రదేశ్‌లో Juvenile Justice Board of District Maharajganj ను ఆదేశించింది. 

అతని సరైన పుట్టిన తేదీ మే 16, 1986 అని.. నేరం జరిగినప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాల 07 నెలల 23 రోజులు అని జువెనైల్ జస్టిస్ బోర్డు మార్చిలో ఒక ఉత్తర్వును జారీ చేసింది. బోర్డు నిర్ధారణను అంగీకారం తెలిపిన న్యాయమూర్తులు జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం అతను వెంటనే స్వేచ్ఛగా ఉండవలసిందిగా ఆదేశించింది. జైలు నుంచి విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. 

బాలనేరస్థుడిని విచారించే అధికార పరిధి జువెనైల్ జస్టిస్ బోర్డ్‌కు మాత్రమే ఉందని.. కేసు తుది పరిష్కారమైన తర్వాత కూడా ఏ న్యాయస్థానం ముందు అయినా బాల్యత్వ దావాను లేవనెత్తడానికి నిందితుడికి అర్హత ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నేరం జరిగిన రోజున నిందితుడు బాలనేరస్థుడని న్యాయస్థానం గుర్తించినట్లయితే.. తగిన ఉత్తర్వులు జారీ చేయడం కోసం న్యాయస్థానం బాలుడిని జువెనైల్ జస్టిస్ బోర్డుకు పంపాలని పేర్కొంది. అయితే ఈ కేసులో దోషి ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని.. ఈ కేసును బోర్డుకు రిఫర్ చేయడం అన్యాయమని ధర్మాసనం పేర్కొంది.

ఇక, ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో దోషి వయసు విషయాన్ని అతడు గానీ, అతడి లాయర్ గానీ ప్రస్తావించలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టులలో శిక్షపై అప్పీలు చేసినప్పుడు కూడా ఈ అంశాన్ని లేవనెత్తలేదు. దీంతో అతడు 17 ఏళ్లు జైలులో గడపాల్సి వచ్చింది.