హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పి.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ చదివే యువతిని దారుణంగా మోసం చేశాడు. ఈ సంఘటన చెన్నై లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...తిరు పోరూర్, ఓల్డ్‌ మహాబలిపురానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని(25) భవన నిర్మాణం సంస్థలో సలహాదారిణిగా పనిచేస్తోంది.

ఈమె గత 8న ఉదయం తిరుప్పోరూర్‌ నుంచి సెమ్మంజేరికి వెళ్లడానికి ఆ ప్రాంతంలోని బస్టాప్‌లో నిలబడింది. ఆ సమయంలో అటుగా ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగి ఆమెతో తాను సినీనిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్‌ కోసం వెతుకుతున్నానని చెప్పి.. మీ ఫీచర్లు బాగున్నాయి.. హీరోయిన్‌గా నటిస్తారా? అని అడిగాడు. అందుకు ఆ యువతి ఒప్పుకుంది. అతను మాట్లాడదామని ఆ యువతిని కారులో మహాబలిపురానికి తీసుకెళ్లాడు.

అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుని కథా చర్చలంటూ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అనంతరం ఆ వ్యక్తి 17వ తేదీన మళ్లీ కలుద్దామని, అప్పుడు డబ్బుతో రావాలని చెప్పాడు. అమె కూడా ఈ నెల 17న రూ.60 వేలు తీసుకుని అతన్ని కలిసింది. ఇద్దరూ కలిసి కారులో కోవైకు వెళ్లి సన్నిహితంగా మెలిగారు. అప్పుడు ఆ యువతి సినిమా చాన్స్‌ గురించి అతన్ని అడిగింది. దీంతో అతను ఆ ఆయువతిని అక్కడే వదిలి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన తల్లికి చెప్పింది. ఫిర్యాదు మేరకు సెమ్మంజేరి పోలీసుల కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.