సమాజంలో రోజు రోజుకీ మానవత్వం మంటకలిసిపోతోంది అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడాల్సిందిపోయి చోద్యం చుస్తూ ఉండిపోయారు. అక్కడితో ఆగకుండా ప్రమాదంలో ఎలా చిక్కుకున్నాడు..ఎలా చచ్చిపోతున్నాడో.. తమ సెల్ ఫోన్లు తీసీ వీడియోలు తీసుకున్నారు.
ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ వ్యక్తి చేసిన ఆక్రందనలు మారుమోగిపోయాయి. ఎవరూ ముందుకు వచ్చి సహాయం చేయకపోవడంతో... పూర్తికా కాలి బూడిదయ్యాడు. కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రం కోట ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్ జైన్(53)వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ప్రేమ్ చంద్ జైన్ కారులో ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు. కాగా... ఆ సమయంలో కోట- ఉదయ్ పుర్ జాతీయ రాహదారిపై ధక్కడ్ ఖేడి గ్రామ సమీపంలో ఆయన కారు ఆగిపోయింది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బయటకు వద్దామంటే కారు డోర్లు తెరుచుకోలేదు. కారు సెంట్రల్ టాక్ పనిచేయలేదు. బయటకు రావడానికి అవస్థలు పడుతూ... మంటల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ.. సహాయం కోసం ఆయన కేకలు పెట్టాడు. మంటల తాకిడి తట్టుకోలేక ఆర్తనాదాలు పెట్టాడు. అతని చావు కేకలను చుట్టుపక్కల వారంతా సినిమా చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోవడం గమనార్హం.

అక్కడితో ఆగకుండా ఆయన చావును సెల్  ఫోన్ లో చిత్రీకరించారు. కనీసం ఒక్కరైనా స్పందించి.. కారు అద్దాలు పగలగొట్టినా అతను సజీవంగా బయటపడేవాడు. కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో... అతను కారులోనే సజీవదహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.