భర్తను ఆయన తల్లిదండ్రుల నుంచి  వేరు చేయాలని భార్య ప్రయత్నిస్తే.. మెంటల్ క్రుయెల్టీ గ్రౌండ్‌ కింద ఆ భర్త డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయవచ్చని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఈ కారణంగానే ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను భార్య కలకత్తా హైకోర్టులో సవాల్ చేయగా.. ఆమె పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 

కోల్‌కతా: భారత సమాజం ఉమ్మడి కుటుంబానికి పెద్ద పీట వేస్తుంది. కానీ, మారుతున్న జీవన శైలి కారణంగా ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. కొందరు ఉద్యోగాల రీత్యా దూరంగా ఉంటుంటే.. మరికొందరు కలహాలతో దూరంగా ఉంటున్నారు. ఇలా దూరంగా ఉంచడానికి కారణాలేవీ లేకున్నా.. దూరంగా ఉండాలని ఇంట్లో భార్య పోరుపెడుతున్నదా? అలా భర్తను, ఆయన తల్లిదండ్రుల నుంచి వేరు చేయాలని ప్రయత్నించడం తప్పే అని కలకత్తా హైకోర్టు చెబుతున్నది. అలా ప్రయత్నిస్తే.. సదరు భర్త.. ఆ భార్యకు విడాకులు ఇవ్వవచ్చని వివరించింది.

తల్లిదండ్రుల నుంచి భర్తను భార్య బలవంతంగా వేరు చేసే ప్రయత్నాలు చేస్తే.. ఆ భార్య నుంచి విడాకులు కావాలని భర్త డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమైన కారణమేమీ లేకున్నా.. భర్తను తల్లిదండ్రులతో బలవంతంగా దూరంగా ఉంచడానికి భార్య ప్రయత్నిస్తే మెంటల్ క్రూయెల్టీ కింద ఆ భర్త డైవర్స్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని వివరించింది.

ఈ కారణంగా భార్య నుంచి భర్తకు విడాకులను ఓ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భార్య కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. మార్చి 31వ తేదనీ న్యాయమూర్తులు సౌమెన్ సేన్, ఉదయ్ కుమార్‌ల ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తల్లిదండ్రులతో కొడుకు నివసించడం అనేది భారత సంస్కృతిలో అతి సాధారణమైన విషయం అని, అది సాంప్రదాయం కూడా అని డివిజన్ బెంచ్ తెలిపింది. తల్లిదండ్రులతో కొడుకు నివసించి వారి బాగోగులను చూసుకోవాల్సిన నైతిక బాధ్యత కొడుకుపై ఉంటుందని వివరించింది.

Also Read: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎంవీఏ నుంచి ఎన్సీపీ నిష్క్రమణ?.. బీజేపీతో దోస్తీ!.. బాజార్ ఎన్నికల్లో కలిసి పోటీ

2009లో వెస్ట్ మిడ్నాపూర్‌కు చెందిన ప్రశాంత్ కుమార్, ఝర్నాలకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును ఆమె కలకత్తా హైకోర్టులో సవాల్ చేసినా.. ఆశించిన ఫలితం రాలేదు.