బిహార్‌లో దారుణం జరిగింది..పెళ్లయిన మహిళను పెళ్లి చేసుకున్నాడని ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళితే.. సీతామరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శరవణ్ మాతో అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది...దీనిని వ్యతిరేకించిన కొందరు వ్యక్తులు ఆదివారం శరవణ్‌ను ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి చితకబాదారు. అతను స్పృహ తప్పడంతో... అతనిని దగ్గర్లోని పొలాలకు తీసుకెళ్లి సజీవ దహనం చేశారు.

ఈ దారుణంపై శరవణ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంట పొలాల్లో సగం వరకు కాలిపోయి.. గుర్తు పట్టని స్థితిలో ఉన్న శరవణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి మొత్తం 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. శరవణ్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు.