అసోంలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను చంపిన ఘటనలో ఓ వ్యక్తిని గ్రామస్తులు దోషిగా తేల్చారు. అంతే కాదు.. దోషిగా తేల్చిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేశారు.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం అసోంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆధారాలు, సాక్ష్యాలను పట్టించుకోకుండా, నిజానిజాలను నిర్దారించుకోకుండా తీర్పులు ఇచ్చే పెద్ద మనుషుల పంచాయితీ సాక్షాత్తు ఓ నిండు మనిషి ప్రాణం తీసింది. ఓ మహిళను చంపేశారన్న ఆరోపణలను విచారించిన పెద్ద మనుషులు నిందితుడిని దోషిగా తేల్చారు. అంతేకాదు, దోషిగా తేల్చిన తర్వాత స్థానికులు ఆ మనిషిని చెట్టుకు కట్టేసి సజీవంగానే దహనం చేశారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. అసోంలో నగావ్ జిల్లాలో బొర్ లాలుంగ్ గావ్ ఏరియాలో ఘటన జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం, గ్రామస్తులు ఓ పంచాయితీ పెట్టారు. ఆ గ్రామంలో సబితా పటోర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మూడు రోజుల క్రితం ఆమె మరణించింది. ఈ ఘటనపై పంచాయితీ పెట్టారు. ఆ పంచాయితీలో ఓ గ్రామస్తులు సాక్ష్యం ఇస్తూ.. సబితా పటోర్‌నను ఐదుగురు చంపారని, అందులో రంజిత్ బొర్డోలొయ్ ప్రధాన నిందితుడు అని వివరించారు.
అంతేకాదు, ఆ పంచాయితీలో రంజిత్ బొర్డోలొయ్ కూడా తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు కొందరు చెప్పారు. దీని తర్వాత గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో ఆమెను చెట్టుకు కట్టి సజీవంగా దహనం చేశారు. అనంతరం, రంజిత్ బొర్డోలొయ్ డెడ్ బాడీని ఖననం చేశారు.
ఈ ఘటనను సాయంత్రం 6 గంటలకు రిపోర్ట్ చేసినట్టు సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్ మృన్మయ్ దాస్ వివరించారు.
ఆనవాయితీగా వస్తున్న రీతిలో అక్కడ పంచాయితీ పెట్టారని, అందులో ఓ వ్యక్తిని దోషిగా తేల్చి ఆ తర్వాత చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారని దాస్ వివరించారు. దీంతో వెంటనే తమ టీమ్ స్పాట్‌కు వెళ్లిందని, అనంతరం ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించినట్టు తెలిపారు.
ఈ ఘటనపై మర్డర్ కేసు పెట్టినట్టు దాస్ వివరించారు. ముగ్గురు మహిళలు సహా ఐదుగురు గ్రామస్తులను విచారించడానికి వారిని తీసుకెళ్లినట్టు తెలిపారు.
ఈ ఏరియాలో నేర ఘటనలను పోలీసులకు ఎక్కువగా చెప్పరని, ఎప్పటి నుంచో వస్తున్న పంచాయితీ ఆనవాయితీనే పాటిస్తారని వివరించారు.
