కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. అతి కిరాతకంగా హత్యచేశాడు ఓ భర్త. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడురాష్ట్రం తెన్‌కాశి జిల్లా, బాలుసత్రం సమీపానగల నాటార్‌పట్టికి చెందిన మురుగన్‌ (40). ఇతను బాలుసత్రం రైల్వేగేటు సమీపాన పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

మురుగన్‌కు విరుదునగర్‌ జిల్లా, తిరిక్కళి ప్రాంతానికి చెందిన చిత్ర (35)తో వ్యాపారం సమయంలో పరిచయం ఏర్పడింది. దీంతో తొమ్మిదేళ్ల క్రితం ఆమెను రెండో వివాహమాడి బాలుసత్రంలో కుటుంబం నడుపుతూ వచ్చాడు. చిత్రకు ఇదివరకే రెండు వివాహాలు జరగగా, మురుగన్‌ను మూడో వివాహం చేసుకుంది. చిత్రకు రెండో భర్త ద్వారా కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు ప్రస్తుతం చిత్రతో నివశిస్తున్నారు.

ఇదిలావుండగా చిత్ర ఆలంగుళం పోలీసు స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తన కుమార్తెపై మురుగన్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ నిమిత్తం మురుగన్, చిత్రను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. విచారణ తర్వాత బయటికి వచ్చిన మురుగన్‌ తన వద్ద నున్న కత్తితో చిత్రపై దారుణంగా దాడి చేసి పరారయ్యాడు. ఆమెను పోలీసులు ఆలంగుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికి త్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి మురుగన్‌ కోసం గాలిస్తున్నారు.