పేకాటలో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చెలరేగిన వాగ్వాదం చివరికి వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేదాకా వెళ్లింది.
ఢిల్లీ : సెంట్రల్ ఢిల్లీలోని రంజీత్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువకుడిని నలుగురు యువకులు కత్తితో పొడిచి చంపారు. బెట్టింగ్‌లో ఓడిపోయానని రూ.300 తిరిగి ఇవ్వమన్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు సోమవారం తెలిపారు.
నిందితులు ప్రమోద్, రజనీష్, అమిత్ కుమార్, రోషన్ సింగ్ లు. వీరంతా 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల వారే. వీరందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు అభిషేక్ ప్రమోద్‌తో కలిసి పేకాట ఆడుతూ బెట్టింగ్‌లో ఆ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని నిందితుడిని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆదివారం బాధితుడిపై కత్తితో దాడి చేశాడు.
భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన అగ్నికీలలు.. నలుగురు మృతి
ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు పాండవ్ నగర్‌లోని సంగమ్ కాలనీలో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు రంజీత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం క్షతగాత్రుడిని మెట్రో ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని ఆయన తెలిపారు.
పోలీసుల విచారణలో, బాధితుడి మామ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అభిషేక్‌ను ముగ్గురు-నలుగురు అబ్బాయిలు వెంబడించడం చూశానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వారు అభిషేక్ ను పట్టుకుని.. కొట్టడం ప్రారంభించారు. ఆ తరువాత హఠాత్తుగా ప్రమోద్ కత్తిని తీసి అభిషేక్ ఛాతీపై, పొత్తికడుపుపై పొడిచాడని డిసిపి తెలిపారు.
అది చూసిన అభిషేక్ మామ అతనికి సహాయం చేయడానికి పరిగెత్తినప్పుడు, అతడిని చూసిన నిందితులు రైల్వే లైన్ వైపు పారిపోయారని ఆయన తెలిపారు. సాంకేతిక నిఘా సహాయంతో, నిందితులను గుర్తించామని.. దాడుల ప్రధాన నిందితుడైన ప్రమోద్ ను గుర్తించామన్నారు. దాడి తరువాత ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు బస్సులో పారిపోతున్న అతన్ని పట్టుకున్నట్లు డిసిపి తెలిపారు.
ఆ తర్వాత, ఇతర ముగ్గురు నిందితులు కూడా నేరాన్ని అంగీకరించారని.. వారిని కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. "ప్రమోద్ బాధితుడి స్నేహితుడు. వారు రైల్వే లైన్, సంగం కాలనీ సమీపంలోని పార్కులో కార్డ్స్ ఆడుతున్నారు. ఈ సమయంలో అభిషేక్ రూ. 300 పోగొట్టుకున్నాడు. తరువాత, అతను తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇది వారి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. గొడవకు దిగారు" అని డిసిపి చెప్పారు.
“అతనికి గుణపాఠం చెప్పేందుకు, ప్రమోద్ తన స్నేహితులు రోషన్, అమిత్, రజనీష్‌లతో కలిసి అభిషేక్ వెంటపడి సంగం కాలనీలోని మాంసం దుకాణం దగ్గర పట్టుకున్నాడు. ఆ తర్వాత కోపంతో అతడి ఛాతీపై, పొత్తికడుపుపై కత్తితో దాడి చేశాడు’’ అని కుమార్ తెలిపారు. నిందితుల కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, రూ.300 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
