బావ బతుకు కోరాల్సిన బావమరిది స్వయంగా తన చేతులతోనే బావ నిండు ప్రాణాలను తీశాడు. వివరాల్లోకి వెళితే... హర్యానా రాష్ట్రం హిస్సార్‌‌లోని బర్వాలాకు చెందిన సచిన్ అనే వ్యక్తి శనివారం తన వర్క్‌ షాపులో పనిచేసుకుంటున్నాడు.

ఆ సమయంలో మిత్రులతో కలిసి బైకులపై అక్కడికి వచ్చిన యువకుడు పని చేసుకుంటున్న సచిన్‌పై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి భార్య కేకలు వేయడంతో అక్కడికి చేరారు. దీంతో కాల్పులకు తెగబడ్డ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

అనంతరం స్థానికులు రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి, భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన తమ్ముడే భర్తను తుపాకీతో కాల్చి చంపాడని, రెండు సంవత్సరాల క్రితం తాను సచిన్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయినందుకు కక్ష పెంచుకుని ఇలా చేశాడని సచిన్ భార్య ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే  హత్యకు దారి తీసిన కారణాలను అన్వేషిస్తున్నారు.