ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. నడిరోడ్డు మీద హత్య జరిగితే చుట్టూ ఉన్నవాళ్లు అడ్డుకోలేదు సరికదా వీడియోలు తీశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవ హత్యకు దారి తీసింది. కోపంతో ఒకరు మరొకరిని రోడ్డు మీద అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. బాటసారులు చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప ఒక్కరు కూడా బాధితుడిని కాపాడే ప్రయత్నం చేయలేదు.

మృతుడి సోదరుడు సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘజియాబాద్‌లోని లోనీకి చెందిన సంజయ్‌, గోవింద్‌కు మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. పూలకొట్టు పెట్టే విషయంలో స్థల కేటాయింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో గోవింద్‌ సంజయ్‌పై పగ పెంచుకున్నాడు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం సంజయ్‌ సోదరుడు అజయ్‌ మీద దాడి చేశాడు. అయజ్ లోనీ మార్గం గుండా వెళ్తుండగా, అతడిని అటకాయించాడు. తన స్నేహితుడు అమిత్‌తో కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అజయ్‌ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు. 

ఈ ఘటనపై సంజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులు గోవింద్‌, అమిత్‌లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కాగా పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.