ఇంటిముందుకు వచ్చిన ఆవును అదిలించాడని వ్యక్తి హత్యకు గురైన దారుణ సంఘటన కాన్పూర్ లో జరిగింది. భార్యాపిల్లల ముందే రమణగుప్త అనే 46యేళ్ల వ్యక్తిని కొట్టి చంపారు. ఆ తరువాత నిందితుడు కుటుంబంతో సహా పరారయ్యాడు. 

ఈ ఘటన కాన్పూర్‌లోని గోవింద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహదేవ్ నగర్ బస్తీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయుష్ యాదవ్ డెయిరీ నిర్వహిస్తున్నాడు.

అతనికి చెందిన ఒక ఆవు రమణ గుప్తా అనే వ్యక్తి ఇంటి ముందుకు వచ్చింది. ఆ సమయంలో రమణ గుప్తా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఆవు పిల్లల మీదికి వస్తే భయపడతారని, అటుగా వెళ్లమని రమణ గుప్తా ఒక కర్రతో ఆ ఆవును అదిలించాడు. 

ఇది ఆయుష్ యాదవ్ గమనించాడు. నా ఆవును అదిలిస్తావా అంటూ రమణ్ గుప్తాతో గొడవకు దిగాడు. తరువాత కర్రతో రమణ గుప్త పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమణ గుప్తను ఆసుపత్రికి తరలించారు. 

అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతి చెందాడని నిర్థారించాడు. ఈ ఉదంతంపై మృతురాలి భార్య మాట్లాడుతూ తమ ఇంటి ముందుకు ఆవు రావడంతో తన భర్త దానిని అదిలించారని... అది చూసి వెంటనే ఆయుష్ తన భర్తపై దాడి చేశాడని తెలిపారు. తన భర్త స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లామని, అక్కడ మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.