ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సూసైడ్‌కు సన్నద్ధం.. ఫేస్‌బుక్, పోలీసుల సహకారంతో దక్కిన ప్రాణాలు.. ఎలాగంటే?
సోషల్ మీడియాలో లైవ్‌లో పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్నాడు. కానీ, ఆ సోషల్ మీడియా సంస్థనే అతని ప్రాణాలను కాపాడటానికి ఫస్ట్ స్టెప్ తీసుకుంది. మెటా సంస్థ పోలీసులను అలర్ట్ చేయడంతో.. వారు లొకేషన్ డిటెక్ట్ చేసి 13 నిమిషాల్లో అతడి ఇంటికి చేరుకుని కాపాడారు. ఈ ఘటన గజియాబాద్‌లో చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఆర్థిక నష్టాలు, ఇతర సమస్యలతో సతమతమైపోయి ఉన్నాడు. డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఇక ఆత్మహత్య తప్ప మరే దారి లేదని అనుకున్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అది సోషల్ మీడియాలో లైవ్‌లో పెట్టాలని అనుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పెట్టి ఆత్మహత్యకు సన్నద్ధం అయ్యాడు. అంతే.. మెటా సంస్థ, పోలీసులు సకాలంలో స్పందించడంతో అతడి ప్రాణాలను రక్షించగలిగారు. అతడిని మాటల్లో పెట్టి ఆత్మహత్య నుంచి తప్పించారు. అలాగే, అతడికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో మంగళవారం రాత్రిపూట చోటుచేసుకుంది.
గజియాబాద్‌లోని విజయ నగర్ ఏరియాలో అభయ్ శుక్లా అనే యువకుడు నివసిస్తున్నాడు. అతను పాత మొబైల్స్ అమ్మే ఓ కంపెనీలో పని చేశాడు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాడు. కానీ, అది సక్సెస్ కాలేదు. నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలను అధిగమించడానికి సోదరి పెళ్లి కోసం తల్లి దాచిన రూ. 90 వేలనూ తీసుకుని వాడుకున్నాడు. అయినా వ్యాపారం నిలువలేకపోయింది. వ్యాపారం నష్టపోవడం, సోదరి పెళ్లి కోసం దాచిన డబ్బునూ ఖర్చు పెట్టడంతో తీవ్ర నిరాశలోకి కుంగిపోయాడు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే అనుకున్నాడు.
అతను ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పెట్టి ఆత్మహత్యకు సిద్ధం అయ్యాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ గుర్తించింది. వెంటనే ఫేస్‌బుక్ హెడ్ క్వార్టర్ దాని సోషల్ మీడియా సెంటర్‌ను అలర్ట్ చేసింది. ఈ సోషల్ మీడియా సెంటర్ పోలీసులకు విషయం చేరవేసింది. లొకేషన్ సహా పలు వివరాలను పోలీసులకు అందించింది.
ఈ విషయం తెలియగానే అభయ్ శుక్లాను పోలీసులు మాటల్లో పెట్టారు. అతనితో కంటిన్యూగా మాట్లాడారు. అనంతరం, ఫోన్ ద్వారా లొకేషన్ గుర్తించారు. అంతే 13 నిమిషాల్లో పోలీసులు అభయ్ శుక్లా ఇంటిని చేరుకున్నారు. అతడిని కాపాడారు.
అనంతరం, అతడిని తమ వద్దకు తీసుకెళ్లారు. అతనితోపాటు కుటుంబానికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి తప్పు రిపీట్ చేయవద్దని పోలీసులు తెలిపారు. అందుకు అభయ్ శుక్లా అంగీకరించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని యూపీ పోలీసు తమ ట్విట్టర్ హ్యాండిల్‌లోనూ పోస్టు చేసింది.