చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఒడిశాలో ఓ వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ దుర్ఘటన జిల్లాలోని పొడియా మండలం, నిలిగుడ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన బుదురు పడియామి ఇంటి వద్ద ఉంటుండగా, అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. నీతో ఒకసారి మాట్లాడాలి బయటకు రా అంటూ పెద్దగా కేకలు పెట్టారు. అతను బయటకు రాగానే.. ఆ ఇద్దరూ తమ వద్ద ఉన్న కత్తితో పడియామి గొంతు కోసి పారిపోయారు.

అయితే అతని కేకలు విన్న పడియామి భార్య బయటకు వచ్చి చూసింది. అప్పటికే అతను రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.