తమిళనాడులో దారుణం జరిగింది. చెల్లెలి ప్రేమ పెళ్లి.. ఓ అన్న ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టింది. ఓ చిన్నారిని అనాథను చేసింది. క్షణికావేశం నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. 

తిరుచ్చి జిల్లా లాల్గుడి సమీపంలో ఆదివారం ఓ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు లాల్గుడి సమీపంలోని తిరుమంగళంకు చెందిన కృపన్ రాజ్ (27) చెన్నైలో ఇంజినీర్ గా పని చేస్తున్నాడు.

రాబిన్ మేరి (26) తో ఏడాది క్రితం వివాహం జరిగింది వీరికి మగబిడ్డ ఉన్నాడు. కృపన్ రాజ్  సోదరి గిరిజను అతడి స్నేహితుడు, తిరుమంగళంకు చెందిన కవియరసన్‌ (27) ప్రేమించాడు.

వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో గిరిజకు వేరొక వ్యక్తితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే గిరిజ, కవియరసన్‌ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. ఇది కృపన్ రాజ్ నచ్చలేదు. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయి.

కృపన్ రాజ్ ఆదివారం బైక్ మీద కవియరసన్ ఇంటి మీదుగా వెళ్తుండగా.. అతని ఇద్దరు సోదరులు అటకాయించి వాగ్వాదానికి దిగారు. కత్తితో కృపన్ రాజ్ పై దాడి చేశారు. దీంతో అతడు స్పృహ తప్పాడు.

వెంటనే అతడిని లాల్గుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. నిందితులు కవియరసన్,  అతని సోదరుడు కలైవానన్‌ సోమవారం సమయపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.