మొదటిసారి విమానం ఎక్కిన వృద్దుడు బాత్రూంలో బీడి కాల్చి కటకటాలపాలయ్యాడు. 

బెంగళూరు : బస్సులు, రైళ్లలో మద్యం సేవించడం, పొగత్రాగడం చేస్తుంటారు కొందరు ప్రయాణికులు. ఇలాగే విమానంలో కూడా పొగత్రాగితే తప్పేమీ లేదని భావించినట్లున్నాడు ఆ వృద్దుడు. మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్న అతడు తెలియక బీడి ముట్టించాడు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వృద్దుడి కటకటాలపాలయ్యాడు. బెంగళూరు విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజస్థాన్ కు చెందిన వృద్దుడు ప్రవీణ్ కుమార్ అహ్మదాబాద్ నుండి బెంగళూరుకు విమానంలో ప్రయాణించాడు. నిత్యం రైలు, బస్సుల్లో ప్రయాణించే అతడు మొదటిసారి విమానం ఎక్కాడు.ఈ క్రమంలో విమానం ఆకాశంలో వుండగా బాత్రూంకు వెళ్లిన అతడు బీడి ముట్టించాడు. దీంతో పొగలు రావడంతో విమానంలోని సెక్యూరిటీ అలారం మోగి ప్రవీణ్ బీడి కాలుస్తున్న విషయం విమాన సిబ్బందికి తెలిసింది. దీంతో వెంటనే విమాన సిబ్బంది బెంగళూరు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. 

బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్దున్ని అరెస్ట్ చేసారు. విమానాశ్రయం నుండి నేరుగా బెంగళూరు సెంట్రల్ జైలుకు అతడిని తరలించారు. నిబంధనలకు విరుద్దంగా విమానంలో బిడి కాల్చి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు ప్రవీణ్ పై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కనీసం అతడికి వారంరోజుల జైలుశిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.

Read More బెంగుళూరా.. మజాకా.. ఉబర్ ఆటో బుక్ చేస్తే.. వెయిటింగ్ టైం చూసి షాక్.. వైరల్ అవుతున్న పోస్ట్...

 అయితే తాను తరచూ రైళ్లలో ప్రయాణిస్తూ వుంటానని... ఆ సమయంలో బాత్రూంలో బీడి కాలుస్తుంటానని వృద్దుడు ప్రవీణ్ తెలిపాడు. అలాగే విమానంలో బీడి తాగవచ్చని అనుకున్నానని... పొగ తాగకూడదని తనకు తెలియదని అన్నాడు. దయచేసి తన తప్పును మన్నించి విడుదల చేయాలని వృద్దుడు పోలీసులను కోరాడు.