ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై కారుకి నిప్పుపెట్టి వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. శుభం చౌదరి అనే యువకుడు, ఓ యువతితో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాడు.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువకుడు ఒక్కసారిగా కారును ఆపి దానికి నిప్పు పెట్టాడు. ఇదేమిటని తోటి వాహనదారులు ప్రశ్నించడంతో తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించాడు.

ఈ తతంగంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు శుభం చౌదరిని, అతడితో పాటు ఉన్న యువతిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా కారు ఎందుకు తగులబెట్టావని పోలీసులు శుభంను ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అంతేకాకుండా ఆ యువతిని కాసేపు తన చెల్లెలని, వ్యాపార భాగస్వామని, స్నేహితురాలని చెప్పాడు.

అతని మాటలను బట్టి శుభం చౌదరి మానసిక పరిస్ధితి బాలేదని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే శుభంకు మరో మహిళతో వివాహం నిశ్చయమైందని కానీ కారులో ఉన్న యువతితో అతనికి సంబంధం ఉండటంతో ఆ పెళ్లి ఆగిపోయిందని తెలుస్తోంది.

దీంతో శుభం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.