కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కాటేశాడు. అభం శుభం తెలియని కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కనీసం కుమార్తెకు మతిస్థిమితం కూడా లేదన్న కనికరం లేకుండా ప్రవర్తించాడు. కాగా.. ఆ కీచక తండ్రి కారణంగా యువతి గర్భం కూడా దాల్చడం గమనార్హం. ఈ దారుణ సంఘటన  హర్యానా పంచుకులాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  పంచు‌కుల జిల్లాలోని సెక్టార్‌ 18 పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ వ్యక్తి మానసిక వికలాంగురాలైన 23 ఏళ్ల తన కూతురిపై తరచుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, కుటుంబసభ్యుల్ని విచారించగా యువతి గర్భానికి గల కారణాలను వారు చెప్పలేకపోయారు.

పోలీసులకు బాధితురాలి తండ్రిపై అనుమానం కలగటంతో అతడ్ని విచారించారు. దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఓ సంవత్సర కాలంగా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు. అనంతరం అతడిపై రేప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని బాధితురాలు వాపోతుండటం గమనార్హం