బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతను నమ్మించి డబ్బులతో ఉడాయించే వ్యక్తులను చూసుంటారు. కానీ ఏకంగా గవర్నర్ పదవి ఇప్పిస్తానంటూ ఓ మహిళ నుండి కోట్లు వసూలు చేసి మోసగించిన ఓ ఘరానా దొంగ చివరకు పోలీసులకు చిక్కాడు. రాజకీయ ప్రముఖులతో వున్న సంబంధాలు, వారితో దిగిన ఫోటోలను చూపించి ఈ మోసానికి పాల్పడ్డాడు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల ఇప్పిస్తానంటూ యువరాజ్ అనే వ్యక్తి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అతడి మోసాల చిట్టా బయటపడింది. ఇతడు సాధారణ మోసగాడు కాదని... ఏకంగా గవర్నర్, ఆర్టిసి అధ్యక్ష పదవులను సైతం ఇప్పిస్తానంటూ పలువురు ప్రముఖులను  సైతం మోసగించినట్లు గుర్తించారు.

యువరాజ్ బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తకు కేఎస్‌ ఆర్టీసీ అధ్యక్ష పదవిని ఇప్పిస్తానంటూ నమ్మించి కోటి రూపాయలను వసూలు చేశాడట. ఉన్నత పదవిలో ఉన్న మహిళకు గవర్నర్‌ పదవిని ఇప్పిస్తానంటూ కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు ప్రచారం. విశ్రాంత ఎస్పీ పాపయ్యను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది.