తాను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న ప్రియురాలు.. తనను మోసం చేస్తుందేమో అన్న అనుమానం కలిగింది ఓ యువకుడికి. అంతే.. ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. థానే జిల్లాలోని డామ్బివిల్లి ప్రాంతానికి చెందిన యువతి(23).. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం కూడా చేస్తున్నారు. కాగా.. ఇటీవల తన ప్రియురాలు.. తనను మోసం చేస్తుందనే అనుమానం ఆ యువకుడిలో కలిగింది.

దీంతో.. ఈ విషయంలో ఆదివారం ప్రియురాలితో వాదన పెట్టుకున్నాడు. ఆ వాగ్వాదం తీవ్రతరం కాడంతో.. కోపం తట్టుకోలేక.. పక్కనే ఉన్న ఎల్పీజీ సిలిండర్ తల పగలగొట్టాడు. అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు అక్కడికి చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించగా..  చికిత్స పొందుతూ మృతిచెందింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.