తిరువనంతపురం: అతి స్వల్ప కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిశాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మొబైల్, పర్సు దొంగిలించడానే అనుమానంపై 30 ఏళ్ల వ్యక్తిని చిత్రంహిసలు పెట్టారు. దాంతో ఆగకుండా అతని మర్మాంగాలకు నిప్పు పెట్టారు. 

కాలిన గాయాలతో ఆ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తిరువనంతపురంలోని తిరువల్లోమ్ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పదునైన, వేడి ఆయుధంతో అతని మర్మాంగాలను కాల్చారు.

ఈ కేసులో నిందితులు ఆటో డ్రైవర్లని పోలీసులు చెబుతున్నారు. తిరువనంతపురం ప్రధాన బస్ స్టాండులో నిద్రిస్తున్న ఓ వ్యక్తి మొబైల్ ను, పర్సును కొట్టేశాడని చెప్పి ఆటో డ్రైవర్ ఆవ్యక్తిపై దాడి చేశారు. 

మర్మాంగాలు 40 శాతం వరకు కాలిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాలిన గాయాల కారణంగానే అతను మరణించినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న వారు తీసిన వీడియోల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.