మంత్రులు, ముఖ్యమంత్రులు ఏదైనా మార్గంలో వెళ్తున్నారంటూ... అరగంట ముందు నుంచే ఆ మార్గంలో ట్రాఫిక్ ని ఆపేస్తారు. వాళ్ల కాన్వాయి వెళ్లేంత వరకు సాధారణ ప్రజలు ఎదురు చూడాల్సిందే. దాదాపు మన దేశంలో ఎక్కడైనా ఇదే జరుగుతుంది. సీఎం దాకా ఎందుకు ఎమ్మెల్యే కాన్వాయి వెళ్లినా ట్రాఫిక్ పోలీసులు ఆ రూట్ లో ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి వాళ్లకు దారి ఇస్తారు.

అయితే... కోల్ కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తాను అందరిలాంటి ముఖ్యమంత్రిని కాదు అని మరోసారి నిరూపించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడటం ఇష్టం లేక తన కాన్వాయిని పక్కన ఆపించి మరీ ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఆగస్ట్ 8న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా వీఐపీ రోడ్డులోని తెఘోరియా క్రాసింగ్‌లో ఇది చోటు చేసుకుంది. తను వెళ్లే దారిలో ట్రాఫిక్ నిదానంగా ఉండటం గమనించిన మమతా.. తన కాన్వాయ్‌ని నిలిపి వేయించారు.

అంతేగాక అక్కడి ట్రాఫిక్ పోలీసులను పిలిచి.. సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చెయ్యమని సూచించారు. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ఆమె కాన్వాయ్ ముందుకు కదిలింది. మమత సుమారు ఐదు నిమిషాలు ట్రాఫిక్‌లో ఉన్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.