తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసిన రైతుబంధు, రైతుబీమా పథకాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌లో ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు.

దీనిలో భాగంగా జనవరి 1 నుంచి ఈ రెండు పథకాలు అమల్లోకి రానున్నాయి. క్రిషక్ బంధు, క్రిషక్ బీమా పేర్లతో వీటిని వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం తెలిపారు.

రైతు బీమా పథకం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది..  ఏ కారణం వల్లనైనా రైతు ఆత్మహత్య చేసుకున్నా.. లేదా సహజంగా మరణించినా 2 లక్షల వరకు బీమా పరిహారం చెల్లిస్తారు. ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులకు బీమా వర్తిస్తుంది.

అలాగే రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.5000 చొప్పున రెండు విడతల్లో అందిస్తారు. తెలంగాణ రైతు బీమా పథకం కింద రూ.5 లక్షలు చెల్లిస్తుండగా, రైతు బంధు పథకం కింద ఎకరాకు రెండు దశల్లో రూ.8 వేలు చెల్లిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని పదివేలకు పెంచనున్నారు.