కోల్‌కత్తా: పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ బెంగాల్ సీఎం మమత బెనర్జీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్ పై ఆమె సచివాలయానికి వెళ్లారు.

తన నివాసం నుండి ఎలక్ట్రిక్ బైక్ పై ఆమె సచివాలయానికి వెళ్లారు. ఎలక్ట్రిక్ బైక్ ను మంత్రి ఫరీద్ హకీం నడుపుతుండగా బైక్ వెనకాల సీఎం కూర్చొన్నారు. పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ రాసి ఉన్న ప్లకార్డును ఆమె తన మెడలో వేసుకొని కూర్చొన్నారు. ఐదు కి.మీ మేర మమత బెనర్జీ ఎలక్ట్రిక్ బైక్ పైనే కూర్చొని సచివాలయానికి చేరుకొన్నారు.

సచివాలయానికి చేరుకొన్న తర్వాత మమత బెనర్జీ పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెంచుతున్న కేంద్రంపై విరుచుకుపడ్డారు. పెట్రోలియం ఉత్పత్తుల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా మమత బెనర్జీ ప్రకటించారు.

మోడీ ప్రభుత్వం తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. చమురు ధరలను ఏ మాత్రం మోడీ సర్కార్ తగ్గించలేదన్నారు.మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజీలు ధరలను ఒక్కసారి పరిశీలించి చూడాలని ఆమె కోరారు. మోడీ, అమిత్ షాలు  దేశాన్ని విక్రయిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.