Mamata Banerjee: ప్రతిసారీ సోనియా గాంధీని ఎందుకు కలవాలి?.. దీదీ కామెంట్స్.. పెద్ద హింటే ఇచ్చేశారుగా..
‘ప్రతిసారీ సోనియా గాంధీని (Sonia Gandhi) ఎందుకు కలవాలి.. ? అదేమీ రాజ్యంగబద్దమైన విధి కాదు కదా’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మాటల ద్వారా ఆమె తన భవిష్యత్తు వ్యుహాలపై పెద్ద హింటే ఇచ్చేశారు.
పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన భవిష్యత్తు రాజకీయాల గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కొద్ది నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన మమతా బెనర్జీ (Mamata Banerjee) మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దూకుడు ప్రదర్శిస్తున్న మమతా బెనర్జీ.. పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించే పనిలో ఉన్నారు. పలు రాష్ట్రాలో తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) విస్తరణకు వ్యుహాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ గోవాలో (goa) పర్యటించారు. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా వెల్లడించారు.
ఇలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మమతా పార్టీ విస్తరణకు పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఉన్న పోటీ.. రెండు పార్టీల మధ్య జాతీయ స్థాయిలో సంబంధాలను కూడా దెబ్బతీసినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చిన మమతా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో (Sonia Gandhi) సమావేశం అవుతారా..? అని విలేకరులు ప్రశ్నించిన సమయంలో దీదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి.. ? అదేమీ రాజ్యంగబద్దమైన విధి కాదు కదా అని వ్యాఖ్యానించారు.
దీంతో తన భవిష్యత్తు రాజకీయాలపై మమతా బెనర్జీ పెద్ద హింట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ పోరుపై సిద్దమయ్యారని.. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలనే ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 general elections) బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమికి ఏర్పడితే అందులో మమతా బెనర్జీ ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. ఆ దిశలోనే మమతా బెనర్జీ అడుగులు కూడా ఉన్నాయి. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో.. ప్రతిపక్ష పార్టీలకు సహకరించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా మమతా బెనర్జీ చెప్పారు. యూపీలో బీజేపీ ఓటమికి తృణమూల్ సాయం కావాలంటే తాము తప్పకుండా వెళ్తామని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు (Akhilesh Yadav) సహాయం కావాలంటే తాము అందజేస్తామని చెప్పారు.
Also Read: Meghalaya congress: మేఘాలయ కాంగ్రెస్‌లో అర్ధరాత్రి తిరుగుబాటు.. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు జంప్..
‘మేము గోవా, హర్యానాలో పార్టీ విస్తరణను ప్రారంభించాం. కానీ కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలను పోరాడనివ్వాలి. వారు ఒకవేళ మేము ప్రచారం చేయాలని అనుకుంటే.. తప్పకుండా సహాయం చేస్తాం’ అని మమతా బెనర్జీ అన్నారు. అంటే ఆమె పోరు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పైనే అని భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని ప్రధాన రాజకీయ శత్రువుగా భావిస్తున్న దీదీ.. కాంగ్రెస్‌తో కూడా దూరం పాటిస్తున్నారు.
ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్‌తో భేటీ కానున్న మమతా బెనర్జీ..
మమతా బెనర్జీ ఓ బిజినెస్ సమ్మిట్ కోసం డిసెంబర్ 1న ముంబై వెళ్లనున్నట్టుగా తెలిపారు. అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లను కలుస్తానని చెప్పారు. శరద్ పవార్ (Sharad Pawar) జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శరద్ పవార్, మమతా బెనర్జీల సమావేశంలో జాతీయ స్థాయి రాజకీయాల గురించే ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉంది.
వారణాసికి కూడా వెళ్లనున్న మమతా బెనర్జీ..
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కమలాపతి త్రిపాఠి (Kamalapati Tripathi) కుటుంబ సభ్యులు గత నెలలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. వీరి కుటుంబానిని వారణాసిలో మంచి పట్టు ఉంది. భవిష్యత్తులో పార్టీ విస్తరణే ధ్యేయంగా మమతా ఈ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
టీఎంసీలో వరుస చేరికలు.. ఎక్కువగా కాంగ్రెస్ నుంచే..
ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా పులవురు రాజకీయ నాయకులను తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. వీరిలో గోవాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం లుయిజిన్హో ఫలీరో, దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ, సిల్చార్ నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్.. వంటి నేతలు ఉన్నారు. అయితే తృణమూల్ విస్తరణ దిశగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే తృణమూల్ కండువా కప్పుకుంటున్నవారిలో మెజారిటీ నేతలు కాంగ్రెస్‌కు చెందినవారే.
ఇక, తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ సమక్షంలో పంజాబ్, హర్యానాకు చెందిన సీనియర్ నేతలు తృణమూల్ కండువా కప్పుకున్నారు. వీరిలో కాంగ్రెస్ నేతలు కీర్తి ఆజాద్, అశోక్ తన్వార్, జేడీయూ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ పవన్ వర్మ ఉన్నారు. ఈ పరిణామాలు గమనిస్తే బలమైన ప్రాంతీయ పార్టీలు లేని రాష్ట్రాల్లో.. తృణమూల్ విస్తరణ చేపట్టేందుకు మమతా బెనర్జీ వ్యుహాలను సిద్దం చేసినట్టుగా స్పష్టం అవుతుంది. అలాగే జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా మమతా బెనర్జీ స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు.