KLO threats video: బెంగాల్‌ను విభజించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రయత్నిస్తోందని, అయితే దానిని ఎప్పటికీ అనుమతించబోమని ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ అన్నారు. 

Kamtapur Liberation Organisation: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం మాట్లాడుతూ బెదిరింపులకు భయపడేది లేదని, తన రక్తాన్ని చిందించడానికి సైతం సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే, బెంగాల్‌ను విభజించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే దానిని ఎప్పటికీ అనుమతించబోమని అన్నారు. నిషేధిత కమ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (KLO) పరారీలో ఉన్న చీఫ్ ప్రత్యేక రాష్ట్రం కోసం తాజాగా డిమాండ్ చేస్తూ.. ఉత్తర బెంగాల్ పర్యటనకు ముందు సీఎంను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఒక రోజు త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

అలీపుర్‌దువార్‌లో ఒక సభను ఉద్దేశించి మ‌మ‌తా బెనర్జీ మాట్లాడుతూ.. "కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు, నేను వారికి భయపడను" అని అన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి మ‌మ‌తా అలీపుర్‌దువార్ మరియు జల్‌పైగురిలో రాజకీయ, పరిపాలనా సమావేశాలను నిర్వహించనున్నారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాషాయదళం "వేర్పాటువాదాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోందని" భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉత్తర బెంగాల్‌లోని అన్ని వర్గాలు దశాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్నాయని ఆమె అన్నారు.

"ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, బీజేపీ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తోంది. కొన్నిసార్లు గూర్ఖాలాండ్, మరికొన్ని సార్లు ఉత్తర బెంగాల్ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతోంది. నేను నా రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ రాష్ట్ర విభజనను ఎప్పటికీ అనుమతించను" అని మ‌మ‌తా బెనర్జీ అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటనకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా, అంత‌కుముందు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ పర్యటనకు ముందు KLO చీఫ్ మరియు మద్దతుదారులు ఆయుధాలు ప‌ట్టుకుని ఉన్న బెదిరింపు వీడియోల‌ను విడుద‌ల చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్నిబ‌యటి వ్యక్తిగా అభివర్ణిస్తూ వేర్పాటువాద గ్రూపు కమ్తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (KLO) చీఫ్ జిబోన్ సింఘా చేసిన వీడియో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అలలు సృష్టించింది. వీడియో సందేశంలో వేర్పాటువాద నాయకుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ముగ్గురు ఎంపిలను కూచ్ బెహార్ ఎంపి నిసిత్ ప్రమాణిక్, జల్పైగురి ఎంపి జయంత రాయ్ మరియు అలీపుర్దువార్ ఎంపి జాన్ బార్లా ప్రత్యేక కోచ్-కామ్తాపూర్ మద్దతుదారులుగా పేర్కొనడం రాష్ట్రంలో మరింత గందరగోళాన్ని సృష్టించింది.

1995లో ఏర్పాటైన KLO ఉత్తర బెంగాల్‌లోని కొన్ని జిల్లాలు మరియు అంతకుముందు కూచ్ బెహార్ రాజ్యంలో ఉన్న దిగువ అస్సాంలోని కొన్ని జిల్లాల నుండి ప్రత్యేక కమ్తాపూర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ సంస్థ ఇక్క‌డ నిష్క్రియంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ పర్యటనకు ముందు ఈ వీడియో వచ్చింది. వీడియో ఎప్పుడు చిత్రీకరించబడిందో లేదా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయబడిందో నిర్ధారించలేనప్పటికీ, జిబోన్ సింఘా తన మద్దతుదారులతో కలిసి ఆయుధాలు పట్టుకుని, ఒక అడవిలోపల ఉన్న ప్రదేశంలో సైనిక దుస్తులు ధరించి కనిపించాడు.