న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తమతో టచ్‌లో ఉన్నారని ఆమె గురువారం మీడియాతో చెప్పారు. 

ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌నూ గౌరవిస్తామని మమతా బెనర్జీ చెప్పారు వారిద్దరు ప్రతిపక్ష కూటమిలో చేరడం లేదు కదా అని ప్రశ్నిస్తే.. వేచి చూడండ ని సమాధానమిచ్చారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడుతామని తెలిపారు.
 
తమ నేత ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు ఉంటాయని, పొత్తులు లేకున్నా జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి కలిసికట్టుగా పనిచేస్తామని ఆమె చెప్పారు. వామపక్ష పార్టీలు తమతో కలిసి వస్తాయో రావో తెలియదని, ఆ పార్టీలతో మాట్లాడలేదని తెలిపారు. 

డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ కాంగ్రెసుతో ఉన్నాయని ఆమె చెప్పారు. రాహుల్‌ గాంధీ, చంద్రబాబు, శరద్‌పవార్‌, ఫరూక్‌, కేజ్రీవాల్‌, తాను బుధవారం సమావేశమైనట్లు తెలిపారు. మరిన్ని పార్టీలు రాజకీయ పరిస్థితుల మేరకు కలుస్తాయని, ఎన్నికల తర్వాత కూడా వస్తాయని చెప్పారు. దేశ ప్రజలు తెలివైనవారని, జాతీయ స్థాయిలో పొత్తులు ఉండి రాష్ట్రాల్లో లేకపోయినా బీజేపీని ఓడించడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రజలు మద్దతు ఇస్తారని అభిప్రాయపడ్డారు.