Asianet News TeluguAsianet News Telugu

నా ఫోన్‌ కెమెరాకి ప్లాస్టర్ వేశా.. పెగాసస్‌ వ్యవహారంపై మమత సంచలన వ్యాఖ్యలు

దేశంలో స్పైగిరి జరుగుతోందని, మంత్రులు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియ, న్యాయ వ్యవస్థ, మంత్రులు, మీడియా హౌస్‌లను పెగాసస్ ఆక్రమించుకుందని ఆరోపించారు

Mamata Banerjee says Have plastered my phone to prevent snooping ksp
Author
New Delhi, First Published Jul 21, 2021, 4:21 PM IST

పెగాసస్ వ్యవహారం దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెగాసస్ స్పైవేర్‌ వ్యవహారంపై స్వీయ విచారణ జరపాలని సుప్రీంకోర్టును దీదీ కోరారు. తాను నిఘా నుంచి తప్పించుకోవడం కోసం తన మొబైల్ ఫోన్‌ కెమెరాకు ప్లాస్టర్ వేసేశానని, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయవలసి ఉందంటూ సెటైర్లు వేశారు.. 

బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత.. తన మొబైల్ ఫోన్ కెమెరాకు టేప్ అంటించి ఉండటాన్ని చూపించారు. వీడియో అయినా, ఆడియో అయినా, అన్నింటినీ ట్యాప్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పెగాసస్ చాలా ప్రమాదకారి అని, వాళ్ళు (బీజేపీ) జనాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తాను ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నానని... కొన్నిసార్లు తాను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని మమతా బెనర్జీ ఆవేదన  వ్యక్తం చేశారు. దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:పెగసాస్ వాడకంపై పార్లమెంటులో ఐటి మంత్రి వివరణ.. దీనిపై ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడి..

దేశంలో స్పైగిరి జరుగుతోందని, మంత్రులు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మమత దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియ, న్యాయ వ్యవస్థ, మంత్రులు, మీడియా హౌస్‌లను పెగాసస్ ఆక్రమించుకుందని ఆరోపించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌తోపాటు దేశ ప్రజలను అభినందిస్తున్నానని చెప్పారు. ధన బలం, కండ బలం, మాఫియా, అన్ని రకాల వ్యవస్థలతో పోరాడామని మమత గుర్తుచేశారు. అన్ని విధాలుగా ఎదురైన ఇబ్బందులను అధిగమించామని వెల్లడించారు. 

కాగా, ఓ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్షియం ఆదివారం సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్ చేయడం కోసం భారత దేశంలోని 300 మొబైల్ ఫోన్ నంబర్లను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చునని వెల్లడించింది. ఇద్దరు మంత్రులు, దాదాపు 40 మంది పాత్రికేయులు, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఓ సిటింగ్ జడ్జి, అనేక మంది వ్యాపారవేత్తల ఫోన్ నంబర్లు ఈ టార్గెట్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. నిర్దిష్టంగా వ్యక్తులపై నిఘా పెట్టలేదని.. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios