కోల్ కత్తా:  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీకి మౌనంగా ఉండడం అలవాటు లేదు. గబగబా మాట్లాడేయడం ఆమెకు అలవాటు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు మాత్రం తన సహజశైలికి భిన్నంగా ఆమె వ్యవహరించారు. 

సోమవారం కేసిఆర్ మమతా బెనర్జీతో సమావేశమై బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చారు. భేటీ వివరాలను, తాము కట్టబోయే కూటమి వివరాలను కేసీఆర్ వివరించారు. కేసిఆర్ మాట్లాడుతున్నంత సేపు మమతా బెనర్జీ మౌనంగా ఉండిపోయారు. 

చివరలో మాత్రం ఓ మాటన్నారు. కేసిఆర్ చెప్పిన విషయాలతో తాను పూర్తి స్థాయిలో ఏకీభవించడం లేదనేది ఆ మాట. జాతీయ వేదికపై ప్రాంతీయ పార్టీలు ప్రముఖమైన పాత్రను పోషించాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి ఆమె ముందు నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, కాంగ్రెసును పూర్తి స్థాయిలో ఆమె వ్యతిరేకించడం లేదు.

ప్రాంతీయ పార్టీల బలంతో కాంగ్రెసు ఆధిపత్యాన్ని నిలువరించాలని కూడా భావిస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా తమతో కాంగ్రెసును తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నారు. నిరుడు ప్రారంభం నుంచే ప్రతిపక్షాల నేతలతో ఆమె సమావేశమవుతూ వస్తున్నారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరేలతో ఆమె భేటీ అయ్యారు. ఆగస్టులో తాను ఢిల్లీ పర్యటించినప్పుడు సోనియా, రాహుల్ గాంధీలను కూడా కలిశారు. 

సోమవారంనాటి ఆమె మౌనాన్ని పరిశీలిస్తే కేసిఆర్ ఎజెండా మేరకు ముందుకు నడవడానికి ఆమె సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. నలబై ఏళ్ల రాజకీయానుభవం గల మమతాను కలవడానికి ఎవరైనా వస్తారనే సంకేతాలను కేసీఆర్ భేటీ విషయంలో తన పార్టీ నేతలకు పంపించారు.