పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీతో ఢీ.. ఢీ అంటే ఢీ అంటున్న తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తృతీయ ఫ్రంట్ ఆలోచన చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీయేతర నేతలకు మమతా బెనర్జీ బుధవారం లేఖలు రాశారు.

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా బీజేపీ దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీకి వ్యతిరేకంగా విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలు పెంచేలా ప్రవేశపెట్టిన వివాదాస్పద చట్టాన్ని ఆమె ఖండించారు.

ఇది ప్రజాస్వామ్యం, సమాఖ్యపై దాడిగా దీదీ అభివర్ణించారు. బీజేపీయేతర పార్టీలు తమ రాజ్యాంగపరమైన హక్కులు, స్వేచ్ఛను వినియోగించుకోకుండా, రాష్ట్రా అధికారాలను నిర్వీర్యం చేయడం ద్వారా వాటిని మున్సిపాల్టీల స్థాయికి దిగజార్చాలని బీజేపీ కోరుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. అలాగే, దేశంలో ఏక పార్టీ పాలనను స్థాపించాలనుకుంటోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. 

దీదీ లేఖలు రాసిన వారిలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు. సీపీఐ, సీపీఎంలను ఆమె విస్మరించడం గమనార్హం.