అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఘటనకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని బీర్‌భూమ్ జిల్లా (Birbhum district)లోని అగ్ని ప్రమాదం సంభవించిన బగ్తుయ్ (Bagtui)గ్రామాన్ని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) గురువారం పరిశీలించారు. బాధితుల బంధువులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. వారికి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. బాధితుల ఇళ్లను మళ్లీ నిర్మించి ఇచ్చేందుకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
బాధిత కుటుంబాలను సందర్శించిన సందర్భంగా మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల్లోని వ్యక్తులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని అన్నారు. బెంగాల్ అంతటా అక్రమ ఆయుధాలు, బాంబుల రహస్య స్థావరాలను వెలికితీయాలని పోలీసులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బుధవారం అగ్నిప్రమాదం సంభవించిన ప్రాంతాల్లో పడి ఉన్న పేలకుండా మిగిలిపోయిన ముడి బాంబు దృశ్యాలను అక్కడి మీడియాలో ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు.
రాంపూర్‌హాట్ హత్యల అనుమానితులను వేటాడవలసి ఉంటుందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. వారు లొంగిపోతే బాగుంటుందని సూచించారు. బాధితులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని అన్నారు. కాగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న 20 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు.
మృతుల పోస్టు మార్టం నివేదిక ప్రకారం సజీవ దహనానికి ముందు బాధితులను తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. బాధితులు సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ బయటకు రాలేదని, అందరూ ప్రాణభయంతో మిన్నకుండిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇదిలా ఉండగా సీఎం మమతా బెనర్జీ బీర్భూమ్‌లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ సింగ్ ధంకర్ ఆమెపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇది సిగ్గుమాలిన సంఘటన అని, పాలనపై చెరగని మచ్చ అని తెలిపారు. ‘‘ ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ప్రజలను సజీవ దహనం చేయడం చాలా బాధాకరం. ముందు వారికి రక్షణ కల్పించడం కంటే గుణపాఠాలు నేర్చుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ’’ అని ఆయన అన్నారు.
అసలేం జరిగిందంటే ?
పశ్చిమబెంగాల్ రాష్ట్రం రాంపూర్ హట్ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మనుషుల్నిలోపల పెట్టి ఇళ్లకు తాళాలు వేసి నిప్పు అంటించారు. దీంతో 10-12 నివాసాలకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 8మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా సోమవారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడు భదు ప్రధాన్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున తాజా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు తెలిపారు.
