కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 15న ప్రతిపక్షాల పార్టీల నాయకులతో సమావేశం కావాలని భావిస్తున్న మమతా బెనర్జీ.. ఇందుకోసం 22 మంది ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆహ్వానం పంపారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఉమ్మడిగా బలమైన అభ్యర్థిని నిలపాలని మమతా బెనర్జీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

‘‘అన్ని ప్రగతిశీల ప్రతిపక్ష పార్టీలు తిరిగి సమావేశమై భారత రాజకీయాల భవిష్యత్తు గమనంపై చర్చించేందుకు రాష్ట్రపతి ఎన్నికలు సరైన అవకాశం’’ అని బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని Constitution Club‌లో సమావేశమవుదామని చెప్పారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విపక్ష పార్టీల మధ్య సమన్వయం కొరబడి బీజేపీ లాభపడిందనే వార్తల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘‘మన ప్రజాస్వామ్యం సమస్యాత్మక సమయాల్లో వెళుతున్న తరుణంలో.. అణగారిన, ప్రాతినిధ్యం లేని వర్గాలను ప్రతిధ్వనించడానికి.. ప్రతిపక్ష పార్టీల గళాలు ఏకం కావడం ఈ సమయంలో ఆవశ్యకమని నేను నమ్ముతున్నాను’’ అని మమతా పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సహా 22 మంది నేతలకు మమతా బెనర్జీ ఈ సమావేశానికి రావాల్సిందిగా లేఖ రాశారు. ఇక, తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేసిన మమతా బెనర్జీ.. ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరినట్టుగా సమాచారం.