మమతా బెనర్జీ: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

Mamata Banerjee Biography: సవాళ్లను ఢీకొట్టే సాహసకారి మమతా బెనర్జీ. ఆమె రాజకీయ జీవితమంతా సవాళ్లు, సాధించిన విజయాలతో నిండి ఉంటుంది. ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ పడిలేచే కెరటంలా తిరిగి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కాలేజీలో ఉన్నప్పటి నుంచే ఆమెకు రాజకీయాలపై మక్కువ. అప్పటి నుంచే డైనమిక్ క్యారెక్టర్‌తో దూకుడుగా, చురుకుగా ఉండేది. ఎంతటి వారినైనా ఖాతరు చేసేది కాదు. దేశంలోని కురువృద్ధ పార్టీతో పొసగక.. బయటికి వచ్చి వెంటనే పార్టీ పెట్టింది. అనతికాలంలోనే ప్రధాన ప్రతిపక్షంగా పార్టీని అభివృద్ధి చేసింది. కేంద్రంలోని బీజేపీ.. పార్టీ అగ్రనాయకులు, కేంద్రమంత్రులు అందరూ పశ్చిమ బెంగాల్‌లో చక్కర్లు కొట్టినా.. ఎన్ని ర్యాలీలు తీసినా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్న రికార్డు బహుశా ఇప్పటి వరకు ఆమెకే దక్కింది. 

Mamata Banerjee Biography: Early Life, Age, Family, Education, Political Journey & More KRJ

Mamata Banerjee Biography: 

మమతా బెనర్జీ బాల్యం :  మమతా బెనర్జీ  5 జనవరి,  1955న కోల్‌కతాలో (పూర్వం కలకత్తా) మధ్యతరగతి బెంగాలీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో ప్రోమిలేశ్వర్ బెనర్జీ- గాయత్రీ దేవి దంపతులకు జన్మించారు. మమతా బెనర్జీకి  17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె తండ్రి సరైన చికిత్స అందించలేకపోవడంతో మరణించాడు. మమతా బెనర్జీ తల్లి 2011లో 81 ఏళ్ల వయసులో మరణించారు. మమతా బెనర్జీకి ఆరుగురు సోదరులు. (అమిత్ బెనర్జీ, అజిత్ బెనర్జీ, కాళీ బెనర్జీ, బాబెన్ బెనర్జీ, గణేష్ బెనర్జీ, సమీర్ బెనర్జీ). మమతా బెనర్జీ సోదరుడు అమిత్ బెనర్జీ కుమారుడే అభిషేక్ బెనర్జీ ఉన్నారు. అతడు దీదీకి చేదోడు వాదోడుగా ఉంటూ.. రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. మమతా బెనర్జీ యొక్క అప్రకటిత వారసుడు కూడా అతడే. మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు. ఆమె  అవివాహితురాలు.

Mamata Banerjee Biography: Early Life, Age, Family, Education, Political Journey & More KRJ

మమతా బెనర్జీ విద్యాభ్యాసం: 

సింప్లిసిటీని ఇష్టపడే మమతా బెనర్జీ విద్యాభ్యాసం గురించి మాట్లాడితే.. ఈ రంగంలో రాజకీయాలలో చాలా మంది ప్రముఖుల కంటే ఆమె చాలా ముందుంది. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన మమతా బెనర్జీ జీవితంలో ఎదురైన సమస్యలన్నీ చదువుకు అడ్డురాకుండా ఉన్నత చదువులు చదివింది. 1970లో మమతా బెనర్జీ దేశబంధు శిశు శిక్షాలయ నుండి హయ్యర్ సెకండరీ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తరువాత 1979లో జోగ్మయా దేవి కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ఆమె శ్రీ శిక్షాయతన్ కళాశాల నుండి B.Ed చేసారు. 1982 సంవత్సరంలో కోల్‌కతా విశ్వవిద్యాలయంలోని జోగేష్ చంద్ర చౌదరి న్యాయ కళాశాల నుండి న్యాయ పట్టా కూడా తీసుకున్నారు. మమతా బెనర్జీ భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుండి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ (D.Litt.) డిగ్రీని ప్రదానం చేసి గౌరవించింది.  

మమతా బెనర్జీ ప్రారంభ జీవితం

మమతా బెనర్జీ తన తండ్రి మరణం తర్వాత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడింది. ఆమె మొదటి రోజుల్లో డబ్బు సంపాదించడానికి, తన తమ్ముళ్లను పోషించడానికి పాలు అమ్మేది. ఆ సమయంలో ఆమె కాలేజీ విద్యార్థిని. మమతా బెనర్జీ పెయింటింగ్ కూడా చేస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పటికీ సమయం దొరికినప్పుడు కుంచె పట్టుకుంటుంది. 2012లో న్యూయార్క్‌లో జరిగిన వేలంలో మమతా బెనర్జీ వేసిన ‘ఫ్లవర్ పవర్’ పెయింటింగ్ 3000 డాలర్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.

Mamata Banerjee Biography: Early Life, Age, Family, Education, Political Journey & More KRJ

మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం:  

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పిలుస్తారు. ఆమె పదునైన వైఖరి, ప్రకటనలతో  మంచి వ్యక్తులను కూడా మాట్లాడకుండా చేస్తారు. మమతా బెనర్జీ భారత రాజకీయాల్లో ఉన్నత స్థానం,  ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. 

బెంగాల్ రాష్ట్రానికి తొలి మహిళ సీఎం మాత్రమే కాదు. వరుసగా మూడోసారి ఆమెనే ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. పలు శాఖలకు కేంద్రమంత్రిగానూ ఆమె బాధ్యతలు చేపట్టారు. రెండు సార్లు రైల్వే శాఖకు బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా మమతా బెనర్జీనే. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమె స్థాపించింది.

>> 1974లో ఆమె కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగంలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

>> రెండేళ్లలోనే అంటే 76లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

>> 1984లో జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి కమ్యూనిస్టు దిగ్గజం సోమనాథ్ చటర్జీని ఓడించారు. యువపార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా ఆమె చేరిపోయారు.

>> 1991లో మళ్లీ లోక్ సభకు ఎన్నికయ్యాక ఆమె పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు చేపట్టారు. 

>> 1997లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో విభేదాలతో అందులో నుంచి బయటికి వచ్చారు. 

>> 1998లో ముకుల్ రాయ్‌తో కలిసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 

>> 1999లో మరోసారి ఎన్నికయ్యాక ఎన్డీయేలో చేరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయ్యారు.

>> 2011లో ఆమె పశ్చిమ బెంగాల్ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఈ విజయం టీఎంసీ విజయంగానే కాదు, కమ్యూనిస్టులకు చావుదెబ్బ గానూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలపాటు(34 ఏళ్ల) వామపక్షాలది బెంగాల్‌లో అప్రతిహత అధికారం కొనసాగింది. 

>> కానీ, 2011లో 294 అసెంబ్లీ సీట్లకు గాను టీఎంసీ కూటమి 227 సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ముఖ్యమంత్రి సీటులోనే ఉన్నారు.

Mamata Banerjee Biography: Early Life, Age, Family, Education, Political Journey & More KRJ

మమతా బెనర్జీ ప్రత్యేకత 

>> 1999లో ఆమె BJP నేతృత్వంలోని NDAలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, రైల్వే అధికారిక వెబ్‌సైట్ IRCTCని మెరుగుపరచడంలో క్రుషి చేశారు. అదే ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, అతను 2000 సంవత్సరంలో తన మొదటి రైల్వే బడ్జెట్‌ను సమర్పించారు. దీనిలో 2000-2001 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో 19 కొత్త రైళ్లను నడపడానికి ఆమోదించారు.

>> ఇది కాకుండా.. ఆమె  తన సొంత రాష్ట్రం బెంగాల్ ప్రయోజనాల కోసం రైల్వేకు సంబంధించిన అనేక పనులు చేశాడు. మూడు దశాబ్దాల నాటి బెంగాల్ వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావడం మమతా బెనర్జీ సాధించిన మరో ఘనత.

>> గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్వప్రయత్నాలు చేసినా.. ఆమె తన పట్టు నిలుపుకున్నారు. తన సీటును ఖాతరు చేయకుండా టీఎంసీకి మెజార్టీ సీట్లను సాధించిపెట్టడంలో దీదీ కృతకృత్యులయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధించి సీఎం సీటును పదిలం చేసుకున్నారు.

మమతా బెనర్జీ ప్రోఫైల్ 
 
పేరు: మమతా బెనర్జీ
వయస్సు : 68 సంవత్సరాలు
పుట్టిన తేదీ: జనవరి 5, 1955
పుట్టిన ప్రదేశం: కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
విద్య; BA, MA, B.Ed, LLB
రాజకీయ పార్టీ: ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
వైవాహిక స్థితి :అవివాహిత
తండ్రి పేరు: ప్రమీలేశ్వర్ బెనర్జీ
తల్లి పేరు: గాయత్రీ దేవి
సోదరుడి పేరు: అమిత్ బెనర్జీ, అజిత్ బెనర్జీ, కాళీ బెనర్జీ, బాబెన్ బెనర్జీ, గణేష్ బెనర్జీ, సమీర్ బెనర్జీ
మేనల్లుడు పేరు: అభిషేక్ బెనర్జీ
శాశ్వత చిరునామా: R/O 30B, హరీష్ ఛటర్జీ స్ట్రీట్, కోల్‌కతా – 700026
ప్రస్తుత చిరునామా: R/O 30B, హరీష్ ఛటర్జీ స్ట్రీట్, కోల్‌కతా – 700026
కార్యాలయ చిరునామా: నబన్న (14వ అంతస్తు) 325, శరత్ ఛటర్జీ రోడ్, దిర్తలా, శిబ్పూర్, హౌరా-711102
ఇమెయిల్ cm@wb.gov.in

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios