పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు తమ మద్దతు ప్రకటించారు. తాము ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కానీ, అఖిలేశ్ యాదవ్‌కు మద్దతు ఇస్తామని వివరించారు. అయితే, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోనూ తాము అన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ కార్యకర్తలకు, నేతలకు చెప్పారు. 

కోల్‌కతా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly Elections) అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) కర్హల్ నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయనపై పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడం లేదు. ఇది కేవలం మర్యాదపూర్వక నిర్ణయమని కాంగ్రెస్ పేర్కొంది. ఇదిలా ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు మరో కీలక పార్టీ మద్దతు కూడా లభించింది. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ(Mamata Banerjee) ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ, అఖిలేశ్ పార్టీకి తాము మద్దతు ఇస్తామని వివరించారు. టీఎంసీ చైర్‌పర్సన్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రణాళికలను వెల్లడిస్తూ.. తాము అఖిలేశ్ యాదవ్‌కు మద్దతు ఇస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. కానీ, అఖిలేశ్ యాదవ్‌కు తాము మద్దతిస్తామని తెలిపారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ యూపీలో పోటీ చేస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు.

గతంలో టీఎంసీ అంటే కేవలం పశ్చిమ బెంగాల్ వరకే చూసేవారని ఆమె అన్నారు. ఇప్పుడు తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరిస్తున్నదని వివరించారు. గోవాలో తాము తమ పార్టీ యూనిట్‌ను నిర్మించామని, త్రిపురలోనూ తమ ఓటు పర్సంటేజీని 20 శాతానికి పెంచుకున్నట్టు పేర్కొన్నారు. బెంగాల్‌ను మరింత పటిష్టంగా చేయాల్సి ఉన్నదని, తద్వారా బీజేపీని మొత్తంగానే ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టవచ్చని తెలిపారు. బెంగాల్‌లోని 42 పార్లమెంటరీ స్థానాలనూ టీఎంసీనే గెలువాలని అన్నారు. తమ పార్టీ ఫస్ట్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌ను ఢిల్లీలో నిర్వహిస్తామని వివరించారు.

పార్టీని మరింత బలోపేతం చేయాలని దీదీ కోరారు. తాము బీజేపీని దేశంలో లేకుండా తరిమి కొడతామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో బలంగా వేళ్లూనుకున్న వామపక్షాలనే వెళ్లగొట్టగలిగామని, బీజేపీని అధికారంలో నుంచి దింపేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు. పంజాబ్, మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై ఆధారపడి ఉన్నదని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు అహంకారం ఎక్కువగా నిండిపోయిందని విమర్శించారు. అయితే, తాను రబీంద్రనాథ్ ఠాగోర్ అడుగుజాడల్లో నడవబోతున్నట్టు వివరించారు. ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, కచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డుల ప్రకటనలపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. పద్మ భూషణ్, పద్మ శ్రీ లు ఇప్పుడు అవార్డులు కావని అన్నారు. అవి దూషణలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పైనా విమర్శలు చేశారు. బడ్జెట్‌పై ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. వెంటనే పెగాసెస్‌తో నిఘా వేస్తున్నారని ఆరోపణలు చేశారు.

‘2024 లోక్‌సభ ఎన్నికల్లో మేం ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తాం’ అని వెల్లడించారు. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీని ఓడించడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. ‘ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం కావాలని నేను కోరుకుంటున్నాను. అన్ని కలిసి పోరాడి 2024లో బీజేపీని ఓడించాలి’ అని అన్నారు. అంతేకాదు, ఏడెనిమిది మంది బీజేపీ నేతలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని వివరించారు. వారు తమ పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు.