ఉద్యోగాల కుంభకోణం కేసులో లాలూ యాదవ్ కుటుంబంపై ఈడీ దాడులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  

ఉద్యోగాల కుంభకోణం కేసు విచారణలో భాగంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి , RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన పలువురి ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు నిర్వహించారు. ఈడీ చర్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున స్పందిస్తూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.మోదీ ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 

ఖర్గే ట్వీట్ చేస్తూ..“గత 14 గంటలుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇంట్లో ఈడీ దాడులు చేస్తుంది. గర్భిణిగా ఉన్న అతని భార్య, సోదరీమణులను వేధిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జీ వృద్ధుడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయినా కూడా మోడీ ప్రభుత్వం వారి పట్ల మానవత్వం చూపడం లేదు అని పేర్కొన్నారు. 

ఈడీ-సీబీఐల దుర్వినియోగం

మరో ట్వీట్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇలా రాశారు, “ప్రతిపక్ష నేతలపై ED-CBIని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని చంపడానికి మోడీ ప్రభుత్వం దుర్మార్గపు ప్రయత్నం చేస్తోంది. పరారీలో ఉన్నవారు కోట్లతో దేశం విడిచి పారిపోయినప్పుడు మోడీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎక్కడ ఉన్నాయి? 'బెస్ట్ ఫ్రెండ్' సంపద ఆకాశాన్నంటుతున్నా.. విచారణ ఎందుకు జరగలేదు? ఈ నియంతృత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు! అని ట్వీట్ చేశారు. 

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈడీ దాడిపై ట్వీట్ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ చీకటి దశను కూడా చూశాం. ఆ యుద్ధంలో మేం కూడా పోరాడాం. నేడు నిరాధారమైన ప్రతీకార కేసుల్లో నా కూతుళ్లు, చిన్న మనవరాలు, గర్భవతి అయిన కోడలను ఈడీ గంటల తరబడి ప్రశ్నిస్తుంది. బీజేపీ ఇంత నీచ స్థాయికి దిగజారి రాజకీయ యుద్ధం చేస్తుందా? అని రాసుకొచ్చారు. లాలూ యాదవ్‌ మరో ట్వీట్‌లో .. ‘సంఘ్‌, బీజేపీపై నా సైద్ధాంతిక పోరాటం ఎప్పటినుంచో కొనసాగుతుంది. నేనెప్పుడూ వారి ముందు తలవంచలేదు, మీ రాజకీయాల ముందు నా కుటుంబం, పార్టీ నుంచి ఎవరూ తలవంచరు’ అని పేర్కొన్నారు. 

ఈ దాడిలో ఈడీ ఏం కనుగొంది?

ఈ దాడుల్లో రూ.53 లక్షల నగదు, 1,900 డాలర్లు, దాదాపు 540 గ్రాముల బంగారం, 1.5 కిలోల బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూలాల ప్రకారం..ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలోని తేజస్వి యాదవ్ ఇంట్లో ED సోదాలు నిర్వహించింది. ఈ ఇంటి చిరునామా ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉంది. దీన్ని యాదవ్ కుటుంబం తమ నివాస ఆస్తిగా వాడుకుంటోందని ఆరోపించారు. లాలూ ప్రసాద్ కుమార్తెలు రాగిణి యాదవ్, చందా యాదవ్, హేమా యాదవ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యేలు అబు దోజానా, అమిత్ కత్యాల్, నవదీప్ సర్దానా, ప్రవీణ్ జైన్‌ల ఇళ్లపై పాట్నా, ఫుల్వారీ షరీఫ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బీహార్‌లోని రాంచీ, ముంబైలలో ఈడీ దాడులు చేసింది.

ఆరోపించిన స్కామ్ ఎప్పుడు జరిగింది?

యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2004-2009 మధ్య కాలంలో భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్ డిలో వివిధ వ్యక్తులను నియమించారని, దానికి ప్రతిగా వారు తమ భూమిని అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ మరియు ఎకె ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఆరోపించారు.