కేరళ: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బీజేపీలో చేరబోతున్నారా...?ప్రధాని నరేంద్రమోదీతో భేటీ ఫౌండేషన్ సేవల కోసమా లేదా రాజకీయ భవిష్యత్ కోసమా.!.కేరళలో తనపట్టు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ అందుకు మోహన్ లాల్ ను అస్త్రంగా ప్రయోగించనుందా..అసలు ఆకస్మాత్తుగా మోదీని మోహన్ లాల్ కలవడం వెనుక వ్యూహం ఏంటి...? ఇవే ప్రశ్నలు కేరళలో సామాన్య పౌరుడి మదిని తొలిచేస్తున్నవి. 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు కేవలం మలయాళంలోనే కాదు తెలుగులోనూ ఎంతో క్రేజ్ ఉంది. సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మోహన్ లాల్ సేవా కార్యక్రమాల్లోనూ అంతే చురుగ్గా పాల్గొంటారు. విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మనసున్న నటుడిగా పేర్గాంచారు. అటు సినీరంగంలో సూపర్ స్టార్ గా...ఇటు సేవా కార్యక్రమాల్లో మంచి వ్యక్తిగా పేరొందిన మోహన్ లాల్ ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. 

రాబోయే ఎన్నికల్లో మోహన్ లాల్ ను తిరువనంతపురం లోక్ సభ కు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. ఈ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున శశిథరూర్ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ ను ఓడించడం మోహన్ లాల్ వల్లే సాధ్యమని భావిస్తోంది.  

మరోవైపు తన రాజకీయ ప్రవేశంపై మోహన్ లాల్ స్పందించడం లేదు. తాను నిర్వహిస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్‌ కార్యక్రమాలను వివరించడానికి మోహన్‌లాల్‌ ప్రధాని మోదీని కలిశానని ట్వీట్ చేశారు. జన్మాష్టమి రోజు ప్రధానిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. గ్లోబల్‌ మలయాళీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సంపూర్ణ సహకారం అందించడానికి ప్రధాని ఒప్పుకొన్నారు. ఇది కేరళలో కొత్త ఒరవడిని తీసుకువస్తుంది అని మోహన్ లాల్ ట్వీటారు. 

మోహన్‌లాల్‌ నిర్వహిస్తున్న ఫౌండేషన్‌ కార్యక్రమాలను ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రసంశించారు. అయితే మోహన్ లాల్ బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను మాత్రం ఖండించడం లేదు. దీంతో మోహన్‌లాల్‌ బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది.